భూత్పూర్ : ప్రజల అవసరాల కోసమే చట్టాలను రూపొందించారని జడ్చర్ల ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి నిహారిక ( Civil Judge Niharika ) అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ( Legal Services Authority ) ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
దేశంలో ఇప్పటికీ అధిక శాతం ప్రజలు నిరుపేదలే ఉన్నారని తెలిపారు. అక్షరాస్యత శాతం కూడా చాలా తక్కువగానే ఉందని అన్నారు. దేశంలో ప్రజలకు చట్టాలపై అవగాహన లేదన్న విషయాన్ని గుర్తించి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి కోర్టులు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. 1986 ముందు మన దేశంలో రెండు కుటుంబాల మధ్య ఒక సమస్య వస్తే ఎవరి వద్దకు వెళ్లాలో తెలిసేది కాదు. ఈ విషయాలను కోర్టులు గుర్తించి 1986లో న్యాయ సేవ అధికార సంస్థను ఏర్పాటు చేసింది.
దీని ద్వారా పేద ప్రజల కోసం ప్రభుత్వమే ఒక న్యాయవాదిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యంగా మోటార్ వాహనాలను నడిపే వ్యక్తులు తన వాహనానికి ఆర్సీ, నడిపే వ్యక్తికి లైసెన్సు, ఆ వాహనానికి ఇన్సూరెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వాహనం నడిపే వ్యక్తి మద్యం సేవించరాదని, కనీస ధర్మాలను పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ జయలక్ష్మి, ఎంపీడీవో ప్రభాకరాచారి, జడ్చర్ల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మాలిక్ షాకీర్, ఎస్సై చంద్రశేఖర్, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ యోగేశ్వర్ రాజ్, న్యాయవాదులు రవి కుమార్ యాదవ్, పాండు కుమార్, రాములు, లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు మురళీధర్ గౌడ్, సుదర్శన్ రెడ్డి, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.