Kalwakurthy | వెల్దండ ఏప్రిల్ 16 : ఉపాధి కూలీ డబ్బులు ఇప్పించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఉపాధి కూలీలు కోరారు. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను ఉపాధి కూలీలు కలిశారు. చాలామంది ఉపాధి కూలీలకు గత ఏడాదిగా కూలీ డబ్బులు రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎండలో కాయ కష్టం చేస్తే కూలీ డబ్బులు ఇవ్వకపోతే ఎలా జీవనం గడపాలని కూలీలు ప్రశ్నించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూలీ డబ్బులు వెంటనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి గ్రామ కార్యదర్శి గిరి గౌడ్లను పిలిచి వెంటనే కూలీలకు డబ్బులు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో కూలీలకు డబ్బులు పెండింగ్లో పెట్టొద్దని అధికారులకు సూచించారు. ఉపాధి పనుల వద్ద తగిన వసతులు ఉన్నాయా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. తాసిల్దార్ కార్తీక్ కుమార్, తదితరులు ఉన్నారు.