మాగనూర్, డిసెంబర్ 20: నిరంతరం సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని మాగనూరు మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దండు రాము (Dandu Ramu) అన్నారు. జర్నలిస్ట్‌లపై అక్రమ కేసులను ఖండిస్తూ శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 17వ తేదీన నారాయణపేట జిల్లా కేంద్రంలో బస్సుల కొరతపై సాక్షి దినపత్రిక విలేకరి రాజేష్, మరో విలేకరి శంకర్‌పై వివిధ సెక్షన్ల కింద అక్రమ కేసులు పెట్టడం ఏంటీ? అని దండు రాము ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై పోరాడుతున్న విలేకరులను ఇలా కేసులతో భయపెట్టడం సహించబోమని.. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన వెనక్కు తగ్గేది లేదని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దండు రాము స్పష్టం చేశారు. విద్యార్థులకు సరిపడా బస్సులను అందుబాటులో ఉంచకుండా నిజాన్ని దాచే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు జర్నలిస్టులపై బస్సు డిపో యజమాన్యం అక్రమ కేసులును బనాయించిందని ఆయన విమర్శించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు మిత్రులు ఏకతాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిపో యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు.
ఇప్పటికైనా అధికారులు నారాయణపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, అదేవిధంగా పల్లెల్లో, పట్టణాల్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా బస్సులు కేటాయించాలని రాము డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాగనూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రహ్లాద్ రెడ్డి నాగేష్, రమేష్ గౌడ్, కథలప్ప, ఆంజనేయులు, రాజు, నరేష్, సగరం రాజు శ్రీనివాసులు, సురేష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.