మాగనూరు డిసెంబర్ 15: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడినందున సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ (Sikta Patnaik) స్పష్టం చేశారు. డిసెంబర్ 17న ఎన్నికలు జరుగనున్న మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ, ఊట్కూరు మండలాల పరిధిలో సోమవారం సాయంత్రం 5 గంటల వరకే ఎన్నికల ప్రచారాన్ని ముగించాలని, సాయంత్రం 5 గంటల తర్వాత నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం వర్తిస్తుందని జిల్లా ఎన్నికల అధికారి సిక్తా పట్నాయక్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరించి నారాయణపేట జిల్లాలోని నిర్దేశిత మండలాల్లో డిసెంబర్ 17న మూడో విడత పోలింగ్ జరగనుందని కలెక్టర్ తెలిపారు. సోమవారం సాయంత్రం 5:00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని, ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని ఆమె వెల్లడించారు. ఎన్నికలు జరిగే మండలాల పరిధిలోని గ్రామాల్లో 44 గంటల సైలెన్స్ పీరియడ్ కొనసాగుతుందని.. ఈ సమయంలో బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదని అధ్యర్థులకు, పార్టీల నేతలకు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా.. ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, ఎం.సి.సి బృందాలు, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. అంతేకాదు సోమవారం సాయంత్రం 5.00 గంటల నుండి ఎన్నికలు ముగిసే వరకు మద్యం షాపులు, కల్లు దుకాణాలను మూసివేయాలని అధికారులను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు