మరికల్, ఆగస్టు 03: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని మరికల్ మండల బీజేపీ (BJP) మండల కార్యదర్శి దేవేందర్ గౌడ్, కోశాధికారి అశోక్ కుమార్, సీనియర్ నాయకుడు నరేష్ గౌడ్ అన్నారు. ఆదివారం మరికల్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో బీజేపీ నాయకులు ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన గ్రామం రేపటి మార్పు అనే అంశంపై ప్రచారాన్ని నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అశోక్ గౌడ్, బూత్ అధ్యక్షులు రమేష్, పవన్, నాయకులు కురువ మల్లేష్, కురువ నరేష్, పరశురాం, శివ కేశవులు, కుమ్మరి నరేష్, చంద్రా మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో..
మహా అభియాన్ సంపర్క్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ధన్వాడ మండల కేంద్రంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హైదరాబాద్ మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు అధిక నిధులు మంజూరు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని 420 హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతంలోని సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం, ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, హై మస్ట్ లైట్లు, వీధి దీపాలు తదితర అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా కార్యదర్శి గోవర్ధన్ గౌడ్, రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, ఉదయభాను, ఉమేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు వెంకటరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాకం సురేందర్ తదితరులు పాల్గొన్నారు.