కొల్లాపూర్ : యాసంగి పంట కాలం కూడా ముగిసి పాయే. ఇంకా మూడెకరాలకు కూడా సరిగ్గా రైతుబంధు ఇవ్వలేదు. ఇందులో కూడా ఎన్నోరకాల మాయలు. భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎన్నోఎత్తుగడలు వేస్తున్నది. రైతు కడుపు కొడుతున్నది. గతంలో టంచనుగా ఎకరాకు ఐదు వేల చొప్పున సీజన్‌కు ముందే బ్యంక్ అకౌంట్లో డబ్బులు పడేటివి. ఒక్క రూపాయి కూడా తక్కువగాకుండా వచ్చేవి. ఇప్పడేమో అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ కోతలు విధిస్తున్నారు. ఎకరా పైన ఉన్న కుంటలకు రైతు భరోసా ఇవ్వట్లేదు. ఎన్నికల హామీలో మాత్రం ఎకరాకు రూ.7 వేలు ఇస్తామని చెప్పి చివరకు ఆచరణలో మాత్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవట్లేదు.
ఉదాహరణకు ఒక రైతుకు రెండెకరాల 21 కుంటల భూమి ఉంటే పైన 21 కుంటకు రైతు భరోసా ఎగ్గొడుతున్నరు. గతంలో కేసీఆర్ ఎకరాకు 5వేల రూపాయలు ఇచ్చినపుడు కంటే ఇప్పడు తక్కువ మొత్తంలో రైతుభరోసా ఇవ్వడంతోటి రైతులు ఆశ్చర్యపోతున్నారు. మరీ ఇంత మోసమా?.. ఆరువేలు ఇస్తమని దొంగ తెలివితేటలు చూపిస్తున్నది రేవంత్ సర్కారు అంటూ మండిపడుతున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 745684.1 ప్రభుత్వం అందించిన డిజిటల్ పాస్ బుక్ రికార్డులలో నమోదైన భూమి ఉంది. ఇంకా వివిధ కారణాలతో రికార్డులలో ఎక్కని వేలాది ఎకరాల భూమి సాగులో ఉంది. రైతు భరోసాని ఎత్తివేసేందుకు సర్వేలో ఆధారంగా గుర్తించి బ్లాక్స్టులో 7771.91 ఎకరాలను పెట్టారు. కానీ అనఅధికారికంగా జిల్లాలో వేలాది ఎకరాల భూమి బ్లాక్ లిస్టులోకి వెళ్లినట్లు తెలుస్తుంది.
ప్రభుత్వం మూడు ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు చెబుతున్న ఆచరణలో మాత్రం కొసరుకు ఎసురు పెట్టింది. కొంతమంది రైతులకు రికార్డులలో మూడెకరాలకు రైతు భరోసా పడిన్నట్లు ఉంది.ఖాతాల్లో డబ్బులు మాత్రం జమాకాలేదు. కోడేరు మండలం నరసాయిపల్లి గ్రామానికి చెందిన రైతు రమేష్ కు రెండు ఎకరాల 25 గుంటల సాగు భూమి ఉంది కానీ రెండు ఎకరాల 16 గుంటల భూమికి మాత్రమే రైతు భరోసా డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో జమయ్యాయి. మిగతా తొమ్మిది గుంటల సాగుభూమికి రైతు భరోసా డబ్బులు పడలేదు. కొల్లాపూర్ మండల పరిధిలోని మరో రైతుకు రెండు ఎకరాల 10 గుంటల భూమి ఉంది కానీ రెండు ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కావడం జరిగింది. ప్రభుత్వం ఎకరాకు 6000 ఇస్తామని చెప్పింది కానీ ఆచరణలో మాత్రం ఎకరాకు కేసీఆర్ సర్కారు కంటే తక్కువే ఇస్తుందని రైతులు వాపోతున్నారు.
రుణమాఫీ మాయజాలం నుంచి రైతులు పూర్తిగా తేరుకోక ముందే రైతు భరోసా ఇవ్వడంలో కూడా రైతులను దగా చేస్తున్నదని రైతులు మండిపడుతున్నరు. రేవంత్ నీ దొంగ తెలివితేటలు రైతుల దగ్గర చెల్లవు త్వరలోనే పంచాయతీ ఎన్నికల్లో నీకు, నీపార్టీకి బుద్ది చెబుతామని హెచ్చరిస్తున్నారు. మండలానికి ఇంతే రైతు భరోసా అని టార్గెట్ పెట్టడంతో అధికారులు వారి ఇష్టం వచ్చినట్లు కోతలు విధిస్తున్నారు. ఒక రైతుకు రెండు లేదా మూడ సర్వే నెంబర్లలో అందులో ఒక ఎకరా ఇందులో పది గుంటలు ఇలా భూమి ఉంటుంది. ఇక్కడే అధికారులు తమ తెలివితేటలు చూపిస్తున్నారు. ఏదో ఒక సర్వేనెంబర్‌కు రైతు భరోసా ఇచ్చి మిగత సర్వేనెంబర్లకు ఎగ్గొడుతున్నారు. ఇదేంది బై అని అడిగితే అదంతే.. ఉన్నబడ్జెట్లో అందరికీ సర్దుబాటు చేయాలి కదా అని తిరిగి రైతులను దబాయిస్తున్నరు.
రైతు భరోసా డబ్బులు ఒకే సర్వే నెంబర్ ఉన్నవారికి పడితే ఒకటి కంటే ఎక్కువ సర్వే నెంబర్లు అర్థ గుంట, రెండు గుంటలు ఉన్న సర్వేనెంబర్లకు డబ్బులు పడనట్లు తెలుస్తుంది. అయితే సర్వే నెంబర్లకు రైతు భరోసా డబ్బులు పడకపోతే ఆ సర్వే నెంబర్లు బ్లాక్ లిస్టులో ఉన్నట్లా అనే విషయం తెలియాలి. రైతు భరోసా డబ్బులు పడని సర్వే నెంబర్లలోని భూమిని కయవిక్రాయాలు చేసేందుకు అవకాశం ఉంటుందో లేదో అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారు. భూమి అనేది రైతులకు ఆత్మగౌరం, ఆత్మగౌరవాన్ని కుదించి రైతుల ఉనికిని ప్రశ్నార్ధకం చేయొద్దు. ప్రభుత్వం ఇప్పటికైనా బ్లాక్ లిస్టులోకి వెళ్లిన సర్వే నెంబర్ లపై రైతు భరోసా పై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.