
నాగర్‌కర్నూల్: రాష్ట్రం కోసం ఏర్పడిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్ అని, మాటను తూటాగా మార్చి రాష్ట్రం తెచ్చిన నేత కేసీ ఆర్ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌లోని పార్టీ కార్యాలయం లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా, మంత్రి ముఖ్య అతి థిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో ఏడేండ్లలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. పనిచేసి ప్రజల ఆశీస్సులు అడిగే పార్టీ అని, అందుకే ప్రజలు పార్టీని ఆశీర్వదిస్తున్నారన్నారు. 100 పనులు చేస్తామని చెప్పిన చోట 90 చేస్తున్నామని, మిగతావి వసతిని బట్టి ముందుకు సాగుతున్నామన్నారు.

దశల వారీగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. వంద పనులు చేసిన చోట రెండు పనులు చేయకపోతే వేలెత్తి చూపడం సరికాదన్నారు. విపక్షాలది ఒంటె పెదవులకు నక్క ఆశ పడ్డ చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీద వ్యతిరేకత రాకపోదా మాకు అధికారం రాకపోదా అని కలలు కంటున్నారన్నారు. 70 ఏండ్లలో జరిగిన అభివృద్ధి ఎంత ఏడేండ్ల తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని సరి చూసుకోవాలన్నారు.
ఒకనాటి కరెంటు కష్టాలు ఇప్పుడు లేకుండా పోయాయని, మున్ముందు ఎప్పటికీ రావొద్దని, తెలంగాణలో ఒక నాటి వలస లు, సాగు నీటి కష్టాలు ఇక రావన్నారు. ఏలిననాడు ఎకరాకు నీళ్లీవ్వని సన్నాసులు ఈ రోజు టీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారన్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని మనషులు బంగారం వేసుకున్న ఫొటోలు సోష ల్ మీడియాలో పెట్టి హేళన చేస్తున్నార్నారు.

బంగారు తెలంగాణ అంలే ఒకనాడు అడ్డీకి పావుశేరు కింద రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ఎకరా భూమిని అమ్ముకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రాకతో పొలంలో బంగారమైందని, ఎకరా రూ.20 లక్షలు పెట్టినా దొరకడం లేదన్నారు. ప్రతి పొలంలో బంగారం లాంటి పంటలు పండుతున్నాయని, ఇదీ బంగారు తెలంగాణ అంటే అన్నారు.
జీవితమంతా ఆంద్రోళ్ల పంచన పడి బతికి ఎన్నడూ ఉద్యమంలో పాల్గొనని సన్నాసులు ఈ రోజు ఏడేండ్ల తెలంగాణ అభి వృద్ధి మీద చర్చిద్దాం అని సవాల్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ పాలన గురించి మాట్లాడే బీజేపీ నేతలు ఒకసారి గుజరాత్లో పర్యటించి తెలంగాణ అభివృద్ధి మీద మాట్లాడాలన్నారు. ప్రధానమంత్రి మోడీ 3సార్లు ముఖ్యమంత్రిగా చేసి నేడు రెండోసారి ప్రధానిగా ఉన్నారని, ఆయన పాలించిన గుజరాత్ కన్నా అభివృద్ధిలో మనమే మిన్న అన్నారు.

కరోనాతో దేశమంతా సంక్షోభంలో ఎక్కడా చేతిలో డబ్బులేక ప్రజలు అల్లాడినా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. విపత్తులోనూ అన్ని రకాల పంటలను వంద శాతం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కొత్తగా 8 మెడికల్ కళాశాలలు కేసీఆర్ మంజూరు చేశారని, విడుతల వారీగా మొత్తం జిల్లా కేంద్రాలలో మెడిక ల్ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ ఆలోచన అన్నారు.
ఇక నుంచి గెలిపించాలన్నా, ఓడించాలన్నా ప్రజలు వందరకాలుగా ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తారన్నారు. చంద్రబాబు గురించి మీడియా ఎంత హైప్ సృష్టించినా 2004లో ప్రజలు విసిరికొట్టారన్నది గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ రాకతో కరువు ఛాయలు పోయి పచ్చని పంట దారులు స్వాగతమిస్తున్నాయని, బీజేపీ అధికారంలో ఉన్న 19 రాష్ర్టాంల్లో జనా భా దామాషా ప్రకారం ఉన్న ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యోగులు అధికంగా ఉన్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే 30 లక్షల ఉద్యోగాల్లో గత ఏడేండ్లుగా 8 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. అధికారం ఇస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ వాటి ఊసెత్తడం లేదని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మోడీ సర్కార్ ప్రైవేట్‌కు వేలం వేసి అమ్ముతున్నారన్నారు.

రాముని గుడి ముందు పెట్టి ప్రజలను రెచ్చగొట్టి అధికారం దక్కించుకున్నారన్నారు. ఆధునిక రాజకీయ యుగంలో కృష్ణ శిలలతో యాదాద్రిని నిర్మించిన అపర భక్తులు కేసీఆర్ అన్నారు. గత ఏడేండ్లలో 103 శాతం తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని, 2014లో రూ.1.22 లక్షలున్న తలసరి ఆదాయం నేడు రూ.2.21 లక్షలకు చేరుకుందన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ ఆదర్శవంతమైన ప్రాంతంగా విలసిల్లాలని ఆకాంక్షించారు.
అంతకు ముందు ఇటీవల హైదరా బాద్‌లో నిర్వహించిన ప్లీనరీ గురించి మాట్లాడుతూ ఎంపిక చేయబడిన ప్రజా ప్రతినిధు లు, పార్టీ ప్రతినిధులను టీఆర్ఎస్ ప్లీనరీకి ఆహ్వానించారని, వారి ఆమోదం మేరకు నిబంధనల ప్రకారం అధ్యక్షుడి ఎన్నిక చట్టబద్దం అవుతుందన్నారు. అంతమాత్రాన ప్లీనరీకి అవకాశం రాని వారు గొప్ప వారు కాదని కాదన్నారు. అంతకు ముం దు నియోజకవర్గంలోని పార్టీ అన్ని మండలాల అధ్యక్షులచే ఎం.పీ రాములు ప్రమాణస్వీకారం చేయించగా, మంత్రి వారిని శాలువాలతో సన్మానించారు.
అనంతరం ఎం.పీ రాములు, ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పద్మావతిలు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్తల కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎం.పీ రాములు, జడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్య, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ హన్మంత్‌రావు, కౌన్సిలర్లు, అన్ని మండలాల, గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.