అచ్చంపేట, ఏప్రిల్ 23: నల్లమల దళిత బిడ్డ సివిల్ సర్వీసెస్ ఫలితాలో మెరిశాడు. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన మండల లింగయ్య-పుష్పమ్మ దంపతుల కుమారుడు మండల సాయికిరణ్ సివిల్ సర్వీస్ ఫలితాల్లో 298 ర్యాంకు సాధించారు. మంగళవారం విడుదలైన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాలలో మెరిసిన యువకుడిని పలువురు అభినందిస్తున్నారు. సాయికిరణ్ ఒకటి నుండి పదో తరగతి వరకు అచ్చంపేట గౌతమి పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ హయత్ నగర్ లో విద్యనభ్యసించారు. డిగ్రీ చదువుతున్న క్రమంలోనే సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో రోజు 8 గంటల నుంచి 10 గంటలపాటు చదివాడు. 2022లో డిగ్రీ పూర్తి చేశాకా ఎంబీఏలో జాయిన్ అయ్యారు.
కోచింగ్కు వెళ్లకుండానే..
ఎంబీఏ చేసుకుంటూ హైదరాబాదులో హాస్టల్లో ఉంటూ ఎక్కడ కోచింగ్ కు వెళ్లకుండా సొంతంగా సివిల్స్ సాధించిన వారి విజయాలను ఆన్లైన్లో చూస్తూ స్ఫూర్తి పొందాడు. నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వహించి ప్రస్తుతం సిద్దిపేట కలెక్టర్ గా పని చేస్తున్న మనూచౌదరి సలహాలు పొందుతూ, బైజూస్ ద్వారా ఆన్లైన్లో కావల్సిన మెటీరియల్ తీసుకొని సొంతంగా ప్రిపేర్ అయ్యారు. 2024లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షకు మొదటిసారి అటెండ్ అయ్యారు. మొదటిసారి ప్రయత్నంలోనే 298 ర్యాంకు సాధించాడు. కేవలం తన తండ్రి లింగయ్య ప్రోత్సాహంతో సివిల్స్ వైపు లక్ష్యాన్ని మళ్లించుకుని ప్రతిరోజు ఉదయం ఐదు గంటలు, సాయంత్రం రెండు గంటల పాటు ప్రిపేర్ అయ్యానని నమస్తే తెలంగాణతో సాయికిరణ్ తన అనుభవాలను పంచుకున్నారు.
ఈ ర్యాంకు ద్వారా ఐఏఎస్ వచ్చే అవకాశం ఉందని, ఒకవేళ ఐఏఎస్ రాకపోతే మళ్లీ ఈసారి సివిల్స్ రాయడానికి సిద్ధంగా ఉన్నానని, అప్లై కూడా చేశానని వచ్చే నెల 25న పరీక్షకు ప్రిపేర్ అవుతున్నానని తెలిపారు. తన లక్ష్యం సివిల్స్ సాధించడమే అంటూ తన విజయాన్ని పేర్కొన్నారు. కేవలం ఎంబీఏ చేసుకుంటూ తనకున్న సమయంలో సివిల్స్ మెటీరియల్ ప్రిపేర్ అవుతూ మొదటిసారి 298 ర్యాంకు సాధించడం నిజంగా గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు.
సమయాన్ని వృథా చేయకండి..
తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఉన్నత విద్యారంగం వైపు వెళ్లడం జరిగిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ తరం యువకులు సమయాన్ని వృథా చేయకుండా తనకు నచ్చిన లక్ష్యాన్ని ఎంచుకొని కావాల్సిన మార్గాలను అన్వేషించుకుంటే అనుకున్న రంగాలలో విజయం సాధిస్తారని సూచించారు. పట్టుదల, క్రమశిక్షణ ముఖ్యమని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్, మనూచౌదరి, చాలామంది ప్రముఖులు, అధికారుల నుంచి అభినందనలు వస్తున్నట్లు పేర్కొన్నారు. లింగయ్య పెద్దకొత్తపల్లి మండల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవోగా పనిచేస్తున్నారు, తల్లి గృహిణి. వారికి ఇద్దరమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. అమ్మాయి లెక్చరుగా పనిచేస్తున్నారు. కుమారుడు సివిల్స్ లో ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.