కొల్లాపూర్, ఫిబ్రవరి 12: నాగర్ కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి సొసైటీలో రుణాలు తీసుకున్న రైతులలో ఏ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. మాఫీ ఈరోజు అవుతుంది రేపు అవుతుందని రైతుల ఎదురుచూస్తున్నారు. బ్యాంకులలో తీసుకున్న రుణానికి వడ్డీ మాత్రం పెరుగుతుంది కానీ సొసైటీలో ఒక్కరికి కూడా రుణమాఫీ ఎందుకు కాలేదో తెలియని పరిస్థితి ఉంది. సొసైటీలో 1400 మంది రైతులు రుణాలకు అర్హత కలిగిన రైతులు ఉన్నారు. ఇందులో ప్రభుత్వము రుణమాఫీ ప్రక్రియను ప్రకటించిన కటాఫ్ గడువులోపు అర్హత కలిగిన 499 మంది రైతులు ఉన్నారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని అర్హత కలిగిన అందరికీ రుణమాఫీ అయినట్లు ప్రకటనలు ఇస్తుంది కానీ పెంట్లవెల్లి సొసైటీలో రుణమాఫీ కాలేదు అనే విషయాన్ని ప్రభుత్వం దాచి పెట్టింది.
ఏ సాంకేతిక లోపంతో పెంట్లవెల్లి సొసైటీలో రుణమాఫీ కాలేదో ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని అధికారికంగా ప్రకటించిన 2024 జులై 18న పెంట్లవెల్లి సొసైటీ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో రామాపురం గ్రామానికి చెందిన మహిళ రైతు వసంతపురం రాములమ్మ సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడుతూ తనకు ఎకరా పొలం ఉందని సొసైటీలోని రూ. అరవై వేలు రుణమాఫీ అయినట్లు తెలిపారు. రుణమాఫీ కాకున్నా తనతో రుణమాఫీ అయినట్లు మాట్లాడించారని బ్యాంకులో వడ్డీ పెరిగిపోతుందని ఆరు నెలలు దాటిన అర పైస రుణమాఫీ కాలేదని ఇప్పుడు రాములమ్మ నమస్తే తెలంగాణతో వాపోయారు. గ్రామంలోకి నాయకులు వస్తే రుణమాఫీ పై నిలదీస్తానని పేర్కొన్నారు.
Runamafi 2
సొసైటీలో తీసుకొన్న రుణాలకు రుణభారం పెరగడంతో పాటు పంటలు పెట్టుబడికి ఏ బ్యాంకు క్రాఫ్ లోని ఇవ్వడంలేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల వద్ద రుణాలు తెచ్చుకుంటే వడ్డీలకే భూములను అమ్ముకోవాల్సిందని వాపోతున్నారు. తీసుకున్న రుణం ఎప్పుడు మాఫీ అవుతుందో తెలపాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. తాసిల్దార్ నుంచి మొదలుపెట్టి సంబంధిత శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వరకు తమ గోడు వెళ్ళబోసుకున్న తమ రుణం ఎప్పుడు మాఫివుతుందో చెప్పడం లేదని ఆత్మ నివేదనతో అధికారుల చుట్టూ తిరిగిన సమాధాన రావడంలేదని రైతులు నిరాశని సృహలోకి వెళ్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పెంట్లవెల్లి సొసైటీలో పంట రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.