కొల్లాపూర్ ఫిబ్రవరి 12 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది… రైతుల సమస్యలు మొదలయ్యాయి. ఒక్కటేమిటీ రైతుబంధు, రైతు భీమా, రుణమాఫీ, నీళ్లు, ఎరువులు ఇలా ఒకటేమిటి తెలంగాణలో రైతుల కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థకావడం లేదు. కొన్నిచోట్ల పండించిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు కూడా కరువయ్యాయి. కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ మార్కెట్ ను ప్రారంభించాలని బుధవారం రైతు సంఘం నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి బాలపీరు మాట్లాడుతూ మండలంలో విస్తారంగా వేరుశనగ పండించిన రైతులకు పంటను విక్రయించేందుకు వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారులనే ఆశ్రయించి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వెంటనే మార్కెట్ యార్డ్ లో వేరుశెనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో వేరుశెనగ రైతులు పాల్గొన్నారు.