మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రగులుతోంది. సీఎం సొంత జిల్లా పాలమూరు జిల్లా చు ట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల రహస్య మీటింగ్‌పై నాగర్‌కర్నూల్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని సృష్టిస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వద్ద జడ్చర్ల ఎమ్మెల్యేకు సంబంధించిన ఒక ఫైలు పెండింగ్‌లో ఉన్నద ని, దానికోసమే ఇదంతా అంటూ ఎంపీ చేసిన వ్యా ఖ్యలపై సదరు ఎమ్మెల్యే ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఆ ఫైల్ ఏమిటో మంత్రి బయటపెట్టాలని.. ఎంపీ చె ప్పాలని డిమాండ్ చేశారు.
‘నేనేం బ్రోకర్ దందాలు చేయడం లేదు’.. అంటూ ఎంపీపై పరోక్షంగా విమర్శలు సంధించారు. ఎమ్మెల్యేల రహస్య భేటీ.. ఎం పీ, ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రిగా మారిపోయింది. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్లో జరిగిన సమావేశం తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రుల నియోజకవర్గం నిధులు వస్తున్నాయి.. అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలే కా మెంట్లు చేశారు. ఈ రహస్య భేటీ జరుగుతున్న విషయాన్ని తెలుసుకొని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల అక్కడికి వెళ్లినట్లు సమాచారం.
హోటల్లో సమావేశమైన ఎమ్మెల్యేలంతా సీఎం వద్ద తేల్చుకుంటామని.. మాతో మాట్లాడడానికి సీఎం ఒప్పుకున్నారంటూ చెబుతున్నారు. మరోవైపు ఎంత జిల్లాలో ఎమ్మెల్యేలను ఉసి గొల్పడం వెనుక నల్లగొండ జిల్లాకు చెందిన మరో మంత్రి హస్తం ఉన్నట్లు ప్రచారం జోరందుకున్నది. మొత్తంపైన ఎమ్మెల్యేల రహస్య భేటీ వ్యవహారం ‘చిలికి చిలికి గాలివాన’గా మారింది. ఈ సమావేశానికి నాయకత్వం వహించిన జడ్చర్ల ఎమ్మెల్యేకి.. మరి కొంతమంది ఎమ్మెల్యేలు టచ్‌లోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అండతో టికెట్ తెచ్చుకొని ఎన్నికైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సీ ఎం చంద్రబాబును టార్గెట్ చేశారు. తిరుమల సిఫార్సు లేఖల విషయంలో అవసరమైతే చంద్రబాబును తెలంగాణలో రానివ్వమంటూ కామెంట్లు చేసి సీఎం రేవంత్‌రెడ్డికి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. దీంతో దిగివచ్చిన ఏపీ ప్రభుత్వం తిరుమలలో ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను అంగీకరించింది. ఆ తర్వాత సొంత ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. బీఆర్ఎస్ హయాంలో మత్స్య శాఖకు అ త్యధిక ప్రాధాన్యతనిస్తే మన ప్రభుత్వంలో ఇవ్వడం లేదంటూ ఆరోపణలు చేశారు. మత్స్యకారులకు అండగా ఉండకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి 50 శాతం చేప పిల్లలను
వదిలేందుకు నిర్ణయం తీసుకున్నది. అంతటితో ఆగకుండా పోలేపల్లి సెజ్‌లో అ రబిందో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఏకం గా శాసనసభలలో ప్రస్తావించారు. కాలుష్యం కారకా లు వెదజల్లుతున్న ఆ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత నియోజకవర్గంలో తన మాట వినడం లేదంటూ ఏకంగా బాలానగర్ తాసీల్దార్ ఆఫీస్‌కు వెళ్లి హంగామా సృష్టించారు. ప్రభుత్వ అధికారులపై ఆరోపణలు గుర్తించి తనకు అనుకూలంగా లేని వారిపై సస్పెన్షన్ వేటు వేయించారు. కాగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తన మాట వినడం లేదంటూ చాలామంది లీడర్ల వద్ద వాపోయారు. ఆయన్ను టార్గెట్ చేస్తూ అనిరుధ్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సీఎంను ఇరుకున పెడుతున్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో ఇక జిల్లాకు నిధుల ఇబ్బంది ఉండదని అంతా భావించారు. ఏడాది కాగానే అంతా రివర్స్ అయింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎప్పుడు వెళ్లి సీఎంను కలిస్తే ఇచ్చిన విజ్ఞాపనలు అన్ని బుట్టదాఖలు అవుతున్నాయి. తాజాగా సీఎం సొంతంగా చేపట్టిన సర్వేలో ఉమ్మడి జిల్లాకు చెందిన చాలామంది ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదని తేలింది. ఇక ఎప్పుడు వెళ్లి సీఎంను కలిసినా
మీ పనితీరు బాలేదు అంటూ సర్వేలో తేలింది.. జాగ్రత్త అంటూ బయటకు పంపించి వేస్తున్నారు. దీంతో అసహనం పెరిగిన ఎమ్మెల్యేలంతా జట్టుగా తయారయ్యారు. నియోజకవర్గాలకు నిధులు రాకపోవడం.. సీఎంకు మంత్రులకు విజ్ఞాపనలు ఇచ్చి నా అవన్నీ నెరవేరకపోవడంతో తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేల వెంబడి ఒకరిద్దరూ మంత్రుల అండదండలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
ఎంపీ ఎన్నికల్లో గెలిపించండి.. ఆగస్టు 15లోపు ముదిరాజ్ బిడ్డ అయిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇస్తానని సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు సాక్షిగా హామీ ఇచ్చారు. మా ట ఇచ్చి ఆరు నెలలు దాటినా ఇప్పటి వరకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఢిల్లీకి పంపిస్తున్న లిస్టులో వాకిటి శ్రీహరి పేరే గల్లంతవుతోంది. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి కూడా అసంతృప్తితో ఉన్నా రు. అయితే ఈ భేటీకి ఆయన దూరమైనట్లు తెలిసింది. నారాయణపేట జిల్లాలో కూడా అసహ నం రగులుతోంది. ఇక మిగతా ఎమ్మెల్యేలు నిధులు తీసుకురాలేక… బీఆర్ఎస్ హయాంలో మంజూరైన వాటికి బిల్లులు కాంట్రాక్టర్లకు ఇప్పించుకోలేక మదన పడిపోతున్నారు. దీంతో సీఎం సొంత జిల్లాలోనే ఎమ్మెల్యేలు కుంపటి పెట్టారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు.. మంత్రుల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నారు. తాము చెప్పిన పనులు కావడం లేదని.. కాంట్రాక్టర్లకు బిల్లును చెల్లించాలన్నా కమీషన్లు ముట్టచెప్పాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడుస్తున్నా నియోజకవర్గాలకు నిధులు తేవడంలో విఫలమవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోపల బాధపడుతున్నారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలను కాదని డిప్యూటీ సీఎం భట్టి సోదరుడు నాగర్‌కర్నూల్ ఎంపీ జోక్యం ఎక్కువ కావడంతో ఎమ్మెల్యేలకు నచ్చడం లేదట.
ఉమ్మడి జిల్లా అంతా అధికారులను.. లీడర్లను కమాండ్ చేస్తున్నారని బోగట. చాలామంది ఎమ్మెల్యేలు మొదటిసారి గెలవడంతో ఆ అనుభవం లేమీ వల్ల సీనియర్ల జోక్యం ఎక్కువైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి గెలిచిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ వచ్చారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఓ మంత్రి అండ చూసుకొని రాష్ట్రంలో నెంబర్ టు మంత్రిగా ఎదుగుతున్న మరో మంత్రిపై పరోక్షంగా విరుచు కుపడుతున్నారు. దీంతో సొంత పార్టీలోనే విపక్షంగా మారుతున్నారు.
‘మా ఫ్యామిలీకి ఓ చరిత్ర ఉంది.. మేము బ్రోకర్ దందాలు చేసేటోళ్లం కాదు.. ఒకవేళ నిజంగా నేను ఆ ఫైల్ గురించి అడిగి ఉంటే రెవెన్యూ మినిస్టర్‌ను బయట పెట్టమనండి’.. అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘ఏ ఫైల్ అడిగాను.. ఏముందో చెప్పమనండి.. నేను కూడా ఆధారాలతో సహా చెప్తా.. రెవెన్యూ మినిస్టర్ బయటికి వచ్చి నేను ఏ ఫైల్ గురించి అడిగినో చెప్పాలి.. అప్పుడు నేనూ చెబుతా.. ఉట్టిగానే నా క్యారెక్టర్ అసాశినేషన్ చేస్తే ఊరుకోను’.. అంటూ నాగర్‌కర్నూల్ ఎంపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షి వస్తున్నారు.. మొత్తం మాట్లాడి వివరాలు చెప్తా’ అన్నారు. ‘నేను డైరెక్ట్‌గా ఎంపీకి సవాల్ విసురుతున్న.. ఆ ఫైల్ గురించి ఎవరు ఫీడ్ చేశారో చెప్పమనండి.. నాకు ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి..
ఆయన చేత ఎవరు చెప్పించారో చెప్పాలి.. నేనడిగిన ఫైల్ ఏమిటో బయట పెట్టాలి’ అంటూ
డిమాండ్ చేశారు. ‘దీనిపై నేను ఎలాంటి సవాల్‌కైనా సిద్ధంగా ఉన్నాను.. ఏ గుడికి రమ్మన్నా వస్తాను.. ఆ ఫైల్ వివరాలు ఏమిటో బయటపెట్టాలి’ అన్నట్లు తెలిసింది. ‘ఈ ఫైల్‌పై మంత్రి, ఎంపీ కచ్చితంగా మా ట్లాడాలి’ అంటూ సవాల్ చేశారు. ఎన్నికల్లో మేము ఎన్నో హామీలు ఇచ్చినాం.. ఆ హామీలు నెరవేర్చాలంటే ఫండ్స్ కావాలి.. వీటి కోసం రిక్వెస్ట్ చేసుకోవాలి కదా.. అంటూ చెప్పుకొచ్చారు. మా బాధ ను వెల్లడించాలని అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం.. అంటూనే త్వరలో వివరాలన్నీ బయటపెడతా.. అంటూ సదరు ఎమ్మెల్యే చెప్పడం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.