ఓం నమఃశివాయ.. హరోహరం.. శంభోశంకర.. గోవింద నామస్మరణ మార్మోగింది. బుధవారం సింగోటం లక్ష్మీనృసింహ స్వామి రథోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయ ధర్మకర్త రాజా బాలాదిత్య లక్ష్మారావు పూజలు చేయగా.. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి దంపతులు రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తజనం సందోహం మధ్య వేడుక అంగరంగ వైభవంగా సాగింది. తేరును లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
కొల్లాపూర్ రూరల్, జనవరి 18 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీనృసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగిం ది. ఆదివారం నుంచి ప్రారంభమైన స్వా మి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రథోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. రాతి చక్రాల రథంపై లక్ష్మీ సమేతంగా నృసింహుడి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఆలయ ప్రధాన పూజారి సంపత్శర్మ ఆధ్వర్యంలో బ్రా హ్మణులు పూజలు చేశారు.
అనంతరం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి దంపతులు, కొల్లాపూర్ రాజా, ఆలయ ధర్మకర్త బాలాదిత్య లక్ష్మారావు పూజలు చేసి రథాన్ని లాగారు. గోవింద నామస్మరణ, హరహర మహాదేవ.. శంభో శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. వేలాది భక్త జనసందోహం మధ్య రథచక్రాలు కదిలాయి. లక్ష్మీదేవమ్మ గుట్ట వ ద్ద ఉన్న శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత రథాన్ని తిరిగి యథా స్థానం వరకు లాగారు.
వివిధ ప్రాంతా ల నుంచి వేలాదిగా భక్తులు తరలి రావ డంతో జాతర ప్రాంగణం కిక్కిరిసిం ది. భక్తులు ఒక రోజు ముందుగానే చేరుకొని దైవ సన్నిధిలో బస చేశారు. తినుబండారాలు, గాజులు, చెరుకు గడల దుకాణా లు కిటకిటలాడాయి. కార్యక్రమాల్లో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్‌సింగ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గున్రెడ్డి నరేందర్‌రెడ్డి, ఎంపీపీలు, నా యకులు, భక్తులు పాల్గొన్నారు.