బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీశ్రేణులు కుటుంబ సభ్యుల్లా తరలివస్తున్నారు. దీంతో అపూర్వ ఆదరణ లభిస్తున్నది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆదివారం మదనాపురం, వంగూరు, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి, కేటీదొడ్డి మండలం మైలగడ్డ స్టేజీ వద్ద నిర్వహించిన సమ్మేళనాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి హాజరయ్యారు. ప్రజల్లోకి వెళ్లి పథకాలను వివరించాలని వారు పిలుపునిచ్చారు.
బాలానగర్ ఏప్రిల్ 2: తెలంగాణ ప్రజలు పడిన బాధలు దేశ ప్రజలు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నరని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అదివారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీలో నాయకులు, కార్యకర్తలు వేరు కాదని.. అందరూ సమానమేనన్నారు. 75 ఏండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని.. ప్రస్తుతం తెలంగాణ వచ్చక, రాకముందు అని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ దేశానికే రోల్‌మాడల్‌గా మారిందని గుర్తు చేశారు. దేశంలో ఏ పార్టీకీ లేనివిధంగా బీఆర్ఎస్లో 60లక్షల మంది సభ్యత్వం తీసుకొని చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గతానికి మించిన మోజార్టీతో గెలిపించుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ జిల్లా ఒడిలో కృష్ణమ్మ పారుతున్నా గంటెడు నీళ్లు తేలేని దౌర్భాగ్యపు నాయకులు ఇక్కడ ఉన్నారని కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. నీరు లేక అలమటించిన జిల్లాను సస్యశామలం చేసేందుకు ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తే కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. 70 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదని.. ఇంకోసారి అధికారం ఇవ్వండని ప్రజలను అడుక్కోవడం సిగ్గుచేటన్నారు. పేదలను ముంచడం, పెద్దలకు పంచడమే బీజేపీ పార్టీ లక్ష్యంగా మారిందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ విజన్ చూసి ప్రధాని మోదీకి వణుకు పుట్టిందన్నారు. దేశ ప్రజల సొమ్మును ప్రధాని మోడీ తన స్నేహితులు అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని
ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ చేసే అసత్య ప్రచారాలను సోషల్ మీడియా ద్వారా బీఆర్ఎస్ నాయకులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి వారు సహపంక్తి భోజనం చేశారు. సమ్మేళనంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ జిల్లా చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మాడ్డి సతీమణి శ్వేత, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బాద్మి శివకుమార్, మార్కెట్‌కమిటీ చైర్మన్ రజినీ, ఎంపీపీ కమల, జెడ్పీటీసీ కల్యాణి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, యూత్వింగ్ అధ్యక్షుడు ప్రకాశ్, జిల్లా గిరిజన నాయకుడు లక్ష్మణ్‌నాయక్, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.