అలంపూర్, మార్చి 15 : నడిగడ్డ ప్రజల సమస్యలపై సీఎం, మంత్రులకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. శాసనమండలి సమావేశంలో ఎమ్మెల్సీ చల్లా శనివారం నడిగడ్డ ప్రజల సమస్యలపై గళం విప్పారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో ప్రజా సమస్యలపై ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమన్నారు.
ప్రభుత్వం పనులు చేస్తున్నామని చెబుతున్నారే తప్పా సం పూర్ణంగా చేయడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ బీమా సేవలను సరిహద్దు ప్రాంతంలో ఉన్న కర్నూల్ దవాఖానలో వర్తింపజేయాలని కోరారు. ఏపీ రాష్ట్రంలో ప్రజలు కర్ణాటకలోని బెంగుళూరు, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వంటి దవాఖానలో బీమా వర్తింపజేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అందుకు సంబంధించిన జీవో కాపీలను ఆరోగ్యశా ఖ మంత్రికి ఎమ్మెల్యే విజయుడు ద్వారా అందించినట్లు వివరించారు.
అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేదన్నా రు. అలాగే రుణమాఫీ విషయంలో అలంపూర్ రైతులకు సమీపంలోని కర్నూల్ పట్టణ బ్యాంకుల్లో ఖాతాలున్నాయని, కేసీఆర్ హయాంలో అక్కడున్న బ్యాంక్ ఖాతాల్లో కూడా రుణమాఫీ వర్తింపజేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో రుణమాఫీ కాలేదన్నారు. సంబంధితశాఖ మంత్రి దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు. పైగా రుణమాఫీ కాదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పంటల ను మార్కెట్కు తీసుకుపోవడానికి సరైన రోడ్లు లేవన్నారు. గ్రామాల అభివృద్ధి కుంటుపడిపోయిందని తెలిపారు. మంత్రులు, సీఎంకు సమస్యలు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదని వెల్లడించారు.