మక్తల్ టౌన్ జూన్ 25: ఈ ఏడాది వానకాలంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ (సంగంబండ) రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్లను నీటితో నింపాలనే లక్ష్యంతో మక్తల్ మండలం చిన్న గోప్లాపూర్ వద్ద ఉన్న భీమా ఫేజ్-1లోని, స్టేజ్-1 పంపుహౌస్ వద్ద ఆదివారం నీటిపారుదల అధికారులతో కలిసి ఎమ్మెల్యే చిట్టెం ఒక మోటారును ఆన్ చేసి నీటిని విడుదల చేశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతాంగానికి సాగునీరు అందించడం కోసం భారీ ప్రాజెక్టు నిర్మించాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి పోరాటాలు చేసి రిజర్వాయర్ నిర్మాణానికి ముఖ్య పాత్ర పోషించారని గుర్తు చేశారు.
మహారాష్ర్టలో అధిక వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదికి వరద వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మక్తల్‌లోని రెండు రిజర్వాయర్లకు నీటి పంపింగ్ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. స్టేజ్-1 పంపుహౌస్ నుంచి మక్తల్ తిరుమలయ్య చెరువు కట్ట వద్ద ఉన్న స్టేజ్-2 పంపునకు నీరు వచ్చిచేరుతుందని స్టేజ్-2 పంపుహౌస్ నుంచి చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 47వ ప్యాకేజ్ కెనాల్ నుంచి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఒక మోటారు రన్నింగ్ ద్వారా రోజుకు 650 క్యూసెక్యులు పంపింగ్ అవుతూ 0.056 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తుందని పేర్కొన్నారు. పంపింగ్ ప్రారంభం అనంతరం కృష్ణమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి పూలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ సీఈ రమణారెడ్డి, ఎస్ఈ నాగేశ్వర్రావు, ఈఈ సంజీవ్ప్రసాద్, డీఈ వెంకటరమణ, ఎంపీపీ వనజమ్మ, సర్పంచులు దత్తు, ఏఈలు రహీం, రాజేశం, బాలరాం, బీఆర్ఎస్ నాయకులు రా మలింగం, శేఖర్‌రెడ్డి, నేతాజీరెడ్డి, ఈశ్వర్ యాదవ్, శివారెడ్డి, రైతులు, నీటి పారుదల శాఖ సిబ్బంది ఉన్నారు.
గద్వాల, జూన్ 25: ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ గద్వాల ఎమ్మెల్యే బండ్లకు ఫోన్ చేసి నీటిని విడుదల చేయాలని సూచించడంతో ఆదివారం ధరూర్ మండల పరిధిలోని గుడ్డెందొడ్డి గ్రామ సమీపంలో ఉన్న నెట్టెంపాడ్ ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన ఫేజ్-1 నుంచి స్విచ్ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం గంగమ్మకు పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటిని చెరువులు, కుంటలు నింపుకోవడంతోపాటు కాల్వలకు విడుదల చేయడంతో రైతులు నార్లు పోసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. రైతులకు పెట్టుబడి కోసం సోమవారం నుంచి రైతుబంధు సాయాన్ని ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. రైతులు నీటిని వృథా చేయకుండా అవసరం మేరకు వినియోగించుకోవాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ నజమున్నీషాబేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ రఘువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.