గద్వాల, ఆగస్టు 21 : అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని.., ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్న ఆలోచనతో తన కుమారుడు సాయిసాకేత్రెడ్డి ‘గడప గడపకూ పలకరింపు’ అనే నినాదంతో పాదయాత్ర చేపట్టినట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని నదీఅగ్రహారంలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఎమ్మెల్యే కుటుంబసభ్యులు పూజలు చేశారు. అనంతరం ‘గడపగడపకూ పలకరింపు’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బండ్ల మాట్లాడుతూ తన రాజకీయ జీవితానికి గద్వాల మండల ప్రజలు వెన్నంటే ఉన్నారని, మొదటగా గద్వాల జెడ్పీటీసీగానే విజయం సాధించానన్నారు.
స్వరాష్ట్రంలో తాగు, సాగు, కరెంట్ సమస్యలు లేవన్నారు. నదీఅగ్రహారం, వెంకంపేట వార్డుల్లో బీసీ, ఎస్సీ కమ్యూనిటీహాల్స్ నిర్మాణాకు నిధులు విడుదల చేశామన్నారు. ప్రజలమధ్య కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టేందుకు కొత్త బిచ్చగాళ్లు వస్తారని, వారిపై అప్రమత్తంగా ఉంటూనే వారిని గెలిపిస్తే ఏం అభివృద్ధి చేస్తారో నిలదీయాలన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. అంతకుముందు నదీఅగ్రహారం, వెంకంపేట గ్రామాల్లో ఎమ్మెల్యే బండ్ల, ఆయన సతీమణి బండ్ల జ్యోతి, తనయుడు సాయిసాకేత్రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. వారికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. సాయిసాకేత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటిలో ఏదోరకంగా లబ్ధి పొందుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్, విజయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, వైస్ చైర్మన్ బాబర్, నాయకులు చెన్నయ్య, మధుసూదన్‌రెడ్డి, రమేశ్‌నాయుడు, వెంకట్రాములు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.