కోయిలకొండ, నవంబర్ 8 : కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే కర్ణాటకలో ప్రజలను నట్టేట ముంచారని, తెలంగాణ ప్రజలను కూడా నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొత్లాబాద్, మల్లాపూర్, సురారం, బూర్గుపల్లి గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణలో అందిస్తున్న 24గంటల విద్యుత్‌తో రైతులు సంతోషంతో వ్యవసాయం చేస్తున్నారని, పక్కన ఉన్న కర్ణాటకలో 5గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. పదేండ్లలోనే ఊహించని అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ ఓర్వలేక ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే వాగ్ధానాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, 60ఏండ్లు నమ్మే ఎంతో గోసపడ్డామన్నారు. పదేండ్లలోనే బీఆర్ఎస్ హయాంలో ఊహించని అభివృద్ధి చేసి అన్నివర్గాల ప్రజలకు అండగా నిలిచామన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందివ్వడమే ప్రధాన లక్ష్యమని, ఆ కల త్వరలో సాకారం కానున్నదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు.
మండలంలోని ఆచార్యపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సమన్వయకర్త ఎస్.రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బి.కృష్ణయ్య, నాయకులు రాజవర్ధన్‌రెడ్డి, మాదవరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, మాదవులు, పార్థసారథి, రామకృష్ణ, మధు, కొండన్న, రాజురెడ్డి పాల్గొన్నారు.