రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈసందర్భంగా దేవరకద్ర నియోజకవర్గం పరిధిలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద బోటింగ్ సౌకర్యాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ జిల్లాను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ప్రకృతి సిద్ధంగా.. కొండల నడుమ ఆహ్లాదకరమైన, అద్భుతమైన వాతావరణంలో కోయిల్ సాగర్ రిజర్వాయర్ ఉంది. గతంలో ఈ రిజర్వాయర్‌లో బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు అవకాశం ఉన్నా.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి అభివృద్ధి జరగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలో అవకాశం ఉన్న అన్ని చోట్ల టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కోయిల్ సాగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు బోటింగ్ సౌకర్యంతో పాటు, హోటల్, రెస్టారెంట్, కాటేజీలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లలో కూడా పర్యాటక అభివృద్ధికి ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ వచ్చిన తర్వాత రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, భూదాన్ పోచంపల్లి పర్యాటక గ్రామంగా మారడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషే కారణమన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతో అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నామన్నారు. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నదే తమ తపన అని, జిల్లాను ఇంకా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కోయిల్ సాగర్‌లో వచ్చే సంవత్సరం నాటికి పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తామని, పర్యాటక శాఖ కల్పిస్తున్న సౌకర్యాలను పర్యాటకులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
దేవరకద్ర ఎమ్మెల్యే.. ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కోయిల్ సాగర్‌లో బోటింగ్ సౌకర్యం వల్ల చుట్టుపక్కన ఉన్న 3, 4 నియోజక వర్గాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. పెద్ద బోటుతో పాటు స్పీడ్ బోటును కూడా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని, నియోజకవర్గంలోని కరివేన రిజర్వాయర్ వద్ద కూడా టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని, కోయిల్ సాగర్‌కు పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని ఆయన తెలిపారు.
పర్యాటక శాఖ ఎండీ మనోహర్, దేవరకద్ర ఎంపీపీ రామా శ్రీకాంత్, జెడ్పీటీసీ అన్నపూర్ణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.