వనపర్తి, జూన్ 28 : పట్టణం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నదని, వివిధ పనుల నిమిత్తం పురపాలక కార్యాలయానికి వచ్చే ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని నూతన పురపాలక కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, కమిషనర్ విక్రమ సింహారెడ్డి, కౌన్సిల్ సభ్యులతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్‌ను ఛాంబర్లోని కుర్చీలో కూర్చొబెట్టి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వనపర్తి జిల్లా ఏర్పాటైన సందర్భంలో ఎస్పీ కార్యాలయం కోసం పురపాలక సంఘం భవనాన్ని కేటాయించగా, ఇటీవల నూతన ఎస్పీ కార్యాలయం ప్రారంభమైనందునా తిరిగి పురపాలక శాఖకు కార్యాలయాన్ని అప్పగించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
నిధుల మంజూరుపై హర్షం..
ముఖ్యమంత్రి కేసీఆర్ గద్వాల పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వనపర్తి నియోజకవర్గానికి నిధులను మంజూరు చేయడంపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బుధవారం హర్షం వ్యక్తం చేశారు. గట్టుకాడిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.2.50 కోట్లు, పెబ్బేర్ మండలం బున్యాదిపురం రోడ్లకు రూ.83.90లక్షలు, గతంలో టౌన్‌హాల్ నిర్మాణానికి రూ.5.కోట్ల కేటాయించగా, అదనంగా మరో రూ.75లక్షలు, జిల్లా కేంద్రంలో డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ1.90 కోట్లు నిధులను మంజూరు చేశారన్నారు. ఇప్పటికే కొనసాగుతున్న గట్టుకాడిపల్లి ఆలయ సుందరీకరణ పనులు, టౌన్‌హాల్ నిర్మాణంతో జిల్లా కేంద్రానికి ప్రత్యేక శోభ సంతరించుకోనున్నదని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.