వనపర్తి, జూలై 27 : ముసురు వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. పాత ఇండ్లల్లో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నీటి ప్రవాహం గల కల్వర్టులు, ప్రాజెక్టుల వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు గస్తీ నిర్వహించాలని సూచించారు. గురువారం వనపర్తి ఐడీవోసీ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ, నీటి పారుదల, ఇతర శాఖాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆలస్యంగా కురిసిన వర్షాలతో వరి నాట్లకు కొంత ఆలస్యమైందన్నారు. రైతులకు కావాల్సిన సహాయాన్ని అందించాలన్నారు. చెరువుల్లోకి నీరు చేరుతుండడంతో నాట్లకు మొగ్గు చూపుతారని, సాంకేతికంగా సరైన అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఆయిల్‌పాం తోటల పెంపకానికి డ్రిప్ ఇరిగేషన్ గ్రౌండింగ్ చేయాలన్నారు. పెబ్బేర్, వనపర్తి ఆర్అండ్బీ రోడ్డు పనులు ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం, టౌన్‌హాల్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ రక్షితామూర్తి, అదనపు కలెక్టర్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.