ఆత్మకూర్, ఆగస్టు 30: పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జూరాలలో ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీకి మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు. అన్నివర్గాల సంక్షేమానికి దేశంలో ఇంతలా ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. పేదలను ఆదుకునేందుకు కల్యాణలక్ష్మి, పింఛన్లు, రైతుబంధు, మాతా శిశు సంక్షేమం, రైతుబీమా తదితర పథకాలను అమలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక విపక్షాలు నోరు పారేసుకుంటున్నాయన్నారు.
స్వరాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రంలో నాలుగింతల పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 20లక్షల మంది రూ.200 పింఛన్లు పొందితే స్వరాష్ట్రంలో 50లక్షల మంది రూ.2వేల పింఛన్లు అందుకుంటున్నారన్నారు. ఇక్కడి నుంచి పారుతున్న కృష్ణమ్మతో జిల్లావ్యాప్తంగా దాదాపు 200 పల్లెలు సుభిక్షమవుతుండగా ఆయా గ్రామాలు జూరాల ప్రజలను తలుచుకుంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దేశానికి దిక్సూచిలా నిలిచిందన్నారు. గ్రామగ్రామానా పింఛన్ల కార్డుల పంపిణీ పండుగలా జరుపుకోవాలన్నారు. ఒకరోజు ముందుగానే జూరాలకు వినాయకచవితి వచ్చిందన్నారు. అంతకుముందు మంత్రి, ఎమ్మెల్యే కలిసి ఆత్మకూర్ మార్కెట్‌యార్డ్‌లో మున్సిపల్ పాలకవర్గం నేతృత్వంలో సమీకృత మార్కెట్‌యార్డ్‌కు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, జెడ్పీటీసీ శివరంజని, మున్సిపల్ చైర్పర్సన్ గాయిత్రీయాదవ్, వైస్‌చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, పీఏసీసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్‌రెడ్డి, మార్కెట్‌యార్డ్ చైర్మన్ ఎస్ఏ రాజు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, జూరాల సర్పంచ్ మహిముదా, ఉపసర్పంచ్ మొగిళి, రైతుబంధు సమితి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి అడ్డా.. తెలంగాణ
అమరచింత, ఆగస్టు 30: ఒకప్పుడు తాగు, సాగునీరు లేక బీడుభూములకు నిలయంగా ఉన్న తెలంగాణ.. నేడు సీఎం కేసీఆర్ పాలనతో ఏడేండ్లలో దేశంలోనే అభివృద్ధికి అడ్డాగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 5వ వార్డు పరిధిలో మంగళవారం మంత్రి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి రూ.2కోట్లతో నిర్మించనున్న సమీకృత మార్కెట్ భవన సముదాయానికి భూమిపూజ చేసి మాట్లాడారు. అంతకుముందు టీఆర్ఎస్వీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు నరేశ్‌రెడ్డి మున్సిపాలిటీలో కొత్తగా ఏర్పాటు చేసిన తులసీవనం వెంచర్ బ్రోచర్‌ను ఎమ్మెల్యే చిట్టెంతో కలిసి మంత్రి విడుదల చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, మున్సిపల్ వైస్‌చైర్మన్ గోపి, ఎంపీపీ చుక్కమాలతి, జెడ్పీటీసీ మార్క సరోజ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, తాసిల్దార్ సింధూజ పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ
వనపర్తి, ఆగస్టు 30: అర్హులకు అందాల్సిన నగదును ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమచేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి మున్సిపాలిటీలోని 33 వార్డులకు సంబంధించి ఆసరా పింఛన్ కార్డులను మంత్రి స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేసి మాట్లాడారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని తెలిపారు. ఈ విడుతలో పింఛన్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరో విడుతలో మంజూరు చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.