తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లాలో చెరువుల పండుగ నిర్వహించారు. మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలు, నాయకులతో కలిసి ర్యాలీగా చెరువుల వద్దకు వెళ్లారు. బతుకమ్మలతో హోరెత్తించారు. కట్టలపై సహపంక్తి భోజనం చేశారు. వనపర్తి నల్ల చెరువు వద్ద బతుకమ్మలతో మహిళలు తరలిరాగా మంత్రి నిరంజన్‌రెడ్డి హాజర య్యారు. ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొని వంటల రుచి చూశారు. పాలెం పెంటోని చెరువు వద్ద గంగా జలాలకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పూజలు చేసి అనంతరం చెరువులో పడవలో విహరించారు. కోయిలకొండ మండలం దమాయపల్లి గణపతిరాయుని చెరువు వద్దకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఎడ్లబండిపై వెళ్లి పూజలు చేశారు. ఎమ్మెల్యేలు బాలరాజు, అబ్రహం, నరేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, జైపాల్ యాదవ్ పాల్గొన్నారు.
వనపర్తి, జూన్ 8 : సాగునీటి రాకతో తెలంగాణ స్వరూపమే మారిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నల్ల చెరువు, తాళ్ల చెరువు, అమ్మ చెరువు, మర్రికుంట చెరువు వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై బతుకమ్మలతో చెరువు వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ముందుగా నల్లచెరువు వద్ద మంత్రి నిరంజన్‌రెడ్డి పూజలు చేసి మాట్లాడారు. 70 ఏండ్లు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీళ్లు లేక ఎడారిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సస్యశ్యామలం చేశారన్నారు. తొమ్మిదేండ్లలో ఊహించని అభివృద్ధి సాధించినట్లు తెలిపారు.
మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసుకోవడంతో వేసవిలోనూ చెరువులు నిండుకుండలా మారాయన్నారు. నల్లచెరువు ఒకప్పుడు దుర్గందానికి నిలయంగా ఉండేదని, నిధులు తెచ్చి చెరువును మినీట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్ది సుందరంగా మార్చామన్నారు. అన్యాక్రాంతమైన రాజనగరం అమ్మచెరువు, తాళ్ల చెరువు, మర్రికుంట చెరువును ఆధునీకరించామని, గతంలో చెప్పిన విధంగా ఎవరూ ఊహించని విధంగా చెరువులను బాగుచేయడంతో పట్టణంలో బోర్లు రీచార్జ్ అయ్యాయన్నారు. చెరువు అంటేనే జీవితమని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. జిల్లా కేంద్రంలో నాలుగువైపులా చెరువులు ఎంతో అందంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కమిషనర్ విక్రమ సింహారెడ్డి, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, చంద్రకళ, సత్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి రూరల్, జూన్ 8 : రాష్ట్రంలో సమృద్ధిగా చేపల ఉత్పత్తి సాగుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మత్స్య ఉత్పత్తుల మేళాను జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయతో రాష్ట్రంలోని చెరువు, కుంటలను పునరుద్ధరించినట్లు తెలిపారు. కృష్ణమ్మ పరవళ్లతో ఒక వైపు రైతులకు సాగునీళ్లు, మత్స్యకారుల ఆర్ధికాభివృద్ధికి ప్రతి చెరువులో పెద్దఎత్తున ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేపల ఉత్పత్తి పెరగిందన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని, మంజూరుకు కృషి చేస్తానన్నారు.
ప్రభుత్వం చెరువుల్లో చేపపిల్లలను మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ఇస్తుండగా, కొన్నిచోట్ల దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారన్నారు. మత్స్యకారులే వాటిని అమ్ముకుంటే లాభం చేకూరుతుందన్నారు. రాష్ట్రంలోనే తొలి మత్స్య కళాశాల వనపర్తి జిల్లా పెబ్బేరులో ఏర్పాటు చేశామని, విద్యార్థులు చేపల పెంపకంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు వివిధ రకాల వంటకాలను ఎలా చేయాలో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. కళాశాలలో తొలి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకొన్నట్లు వెల్లడించారు. అంతకుముందు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి సందర్శించి వంటకాలను రుచి చూశారు. అనంతరం మత్స్యకళాశాలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ, కృష్ణ, మత్స్యశాఖాధికారి రెహమా న్, మత్స్యకళాశాల ప్రిన్సిపాల్ భానుప్రకాశ్ పాల్గొన్నారు.
ఖిల్లాఘణపురం, జూన్ 8 : విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండలంలోని షాపూర్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని గురువారం ప్రారంభించారు. అంతకుముందు గ్రామస్తులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తొమ్మిదేండ్లలో గ్రామాల రూపురేఖలు మొత్తం మారిపోయాయని తెలిపారు. గొప్ప సంలక్పంతో తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నామని, ప్రతిఒక్కరూ అందుకు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణనాయక్, జెడ్పీటీసీ సామ్యనాయక్, సర్పంచ్ బాలాంజనేయులుగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ మురళీధర్‌రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకట్రావ్, ఎంపీటీసీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.