గద్వాల, ఆగస్టు 17 : ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఊర్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన చోటుకు ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వాపస్ వస్తున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సదుపాయం లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఉపాధి పొందేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సాగునీరు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్, రైతుబంధు సాయంతో జిల్లాలో వలసలు తగ్గిపోయి రాయలసీమ, కర్ణాటక ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. జిల్లాలో జూరాల ప్రాజెక్టుతోపాటు నెట్టెంపాడ్, ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉండడంతో జిల్లా అంతటా ఎక్కడ చూసినా పచ్చగా కనిపిస్తుంది. గతంతో పోలిస్తే జిల్లాలో ప్రధానంగా సాగు పెరిగింది. జిల్లాలో ప్రధానంగా వరి, కంది, పత్తి, వేరుశనగ, మిర్చిపంటలు సాగు చేస్తారు. ఈ వానకాలంలో జిల్లాలో వరి, కంది, పత్తి, వేరుశనగ ఇతర పంటలు 3,90,325 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో సీడ్ పత్తి సుమారు 35వేల ఎకరాల్లో సాగు చేసినట్లు అధికారులు అంచరా వేశారు. సాగు పెరగడంతో కూలీల కొరత ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి కూలీలు వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి వలస వెళ్లే పరిస్థితి నుంచి ప్రస్తుతం ఇక్కడికే ఇతర రాష్ట్రాల కూలీలు వలస వచ్చి ఉపాధి పొందే పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.
ఇతర రాష్ర్టాల నుంచి
కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్, గట్టు, కేటీదొడ్డి, ధరూరు, అయిజ, రాజోళి, అలంపూర్ ప్రాంతాలకు వలస కూలీలు వస్తున్నారు. జిల్లాకు వానకాలం సీజన్లో సుమారు 10వేల మంది ఇక్కడికి వలస వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కూలీ పని కోసం వచ్చిన వారు రెండు నెలలపాటు ఇక్కడే ఉండి కూలీ చేసుకుని తిరిగి వెళ్తున్నారు. ఎక్కువగా కర్ణాటకలోని దేవులపల్లి, రాంపురం, రాయచూర్, రాజోళిబండ, బిజినెగేరి, మల్లబావి, గుంజహళ్లి, జిల్లంగేరి, పుచ్చలదిన్నె, మంజర్ల, లింగన్ఖాన్దొడ్డి, కలువలదొడ్డి, ఉండ్రాలదొడ్డి, సింగనేడి, బాపురం, రాయలసీమలోని ఎమ్మిగనూర్, కోడ్మూరు, దేవనకొండ, పెద్దపాడ్, నాగల్దిన్నె, కొత్తకోట, కరివేముల, తెర్నకల్, ప్యాలకుర్తి, బొమ్మరాళ్ల, కనికవీడు తదితర ప్రాంతాల నుంచి కూలీలు వలస వస్తున్నారు.
జీతం లెక్కన కూలీ..
కర్నాటక, రాయలసీమలో పని దొరకని సమయంలో కూలీలు గద్వాల జిల్లాకు వలస వస్తుంటారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కూలీల అవసరం ఎక్కువగా ఉంటుంది. వరినాట్లు, సీడ్పత్తి క్రాసింగ్ పనులు ఉండడంతో ఇతర ప్రాంతాల కూలీలను ఇక్కడికి తీసుకొచ్చి ఒక వ్యక్తికి నెలకు రూ.18వేలు ఇవ్వడంతోపాటు వారికి వసతి కల్పించి భోజనం పెడుతున్నారు. ఇతర పనులకు వచ్చే వారికి రోజు వారి కూలీ పనిని బట్టి రూ.400 నుంచి రూ.500 చెల్లిస్తున్నారు. సీడ్పత్తి క్రాసింగ్ చేసే కూలీలకు రోజుకు రూ.600 ఇస్తున్నారు.
సీమలో పనుల్లేక వలసొచ్చాం
మాది రాయలసీమలోని గుడికల్ గ్రామం. మా ప్రాంతంలో సరైన నీటి వసతి లేకపోవడంతో పనులు లేవు. ప్రస్తుతం గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలం సద్దలో నిపల్లిలో సీడ్పత్తి క్రాసింగ్ పనులు చేస్తున్నాం. సుమారు 2వేల మందికి పైగా మా ప్రాంతం నుంచి వచ్చినవారే ఉన్నారు. మాకు నెలకు జతకు రూ.36వేల కూలీతోపాటు భోజనం, వసతి కల్పిస్తున్నారు. రెండు నెలలు సీడ్ పత్తి క్రాసింగ్ చేసి మా గ్రామాలకు తిరిగి వెళ్లిపోతాం.
– ఉరుకుందు, మహాలక్ష్మి, గుడికల్, కర్నూల్ జిల్లా
ఇక్కడ కూలీ ఎక్కువ..
మా ప్రాంతంలో పనులు తక్కువగా ఉండడంతోపాటు కూలీ కూడా తక్కువ ఇస్తారు. గద్వాల జిల్లాలో రోజు కూలి రూ.600 ఇస్తున్నారు. అంతేకాకుండా నివాసం, భోజన వసతి కల్పిస్తున్నారు. ఇక్కడ నాలుగు నెలల పాటు పనులు చేసి తిరిగి మా ప్రాంతానికి వెళ్లిపోతాం. పనిచేసే చోట యజమాని కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టరు.
– కొండమ్మ, గుడికల్
ఇక్కడి ప్రజలు మంచిగా ఆదరిస్తుండ్రు..
గద్వాల జిల్లాకు ప్రతి ఏడాది కూలీ పనికి వస్తాం. రెండు నెలలు కూలీ పని చేసుకుంటాం. తర్వాత మా గ్రామాలకు వెళ్తాం. ఇక్కడి ప్రాంతవాసులు మమ్మల్ని మంచిగా ఆదరిస్తరు. సీడ్పత్తిలో పని చేయడానికి ఇక్కడికి వచ్చాం. పదేండ్ల కిందటితో పోలిస్తే గద్వాల ఎంతో మారిపోయింది. పచ్చనిపంటలతో సస్యశ్యామలంగా మారింది.
-నాగరాజు, గుడికల్