నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 17 : రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు సెప్టెంబర్ 17 అని బీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ జాతీ య సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకు లు, కార్యకర్తల సమక్షంలో మర్రి జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతరం మర్రి మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగుపెట్టిన రోజు అని, కొంత మంది దీనిని విమోచనమని, విలీనం అన్నా వేలాది మంది నాటి రాచరిక వ్యవస్థపై పోరాటం చేసి ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. ఆనాటి పోరాట యోధులకు, అమరవీరులందరికీ బీఆర్ఎస్ తరుఫున శిరస్సు వంచి నివాళుల ర్పిస్తున్నామన్నారు. ఆనాటి సాయుధ రైతాం గ పోరాటం నుంచి మొలుకొని 1969 తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం అన్నింటినీ తెలంగాణ చూసిందన్నారు.
గ్రూప్-1 విద్యార్థులు తమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని తమ ఆవేదనను వ్యక్త పరచడానికి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంతో దాడి చేసిందన్నారు. ఒకవైపు రైతన్నలు యూరియాలేక ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఒలింపిక్స్ గురించి మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకు లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.