మహబూబ్ నగర్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మూసాపేట : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత యువతి లైంగికదాడి, హత్యకేసు అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు హడావుడిగా నిందితుని అరెస్టు చేసి రిమాం డ్ పంపడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేముల గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. పోలీసు దర్యాప్తు సక్రమంగా లేదని విచారణ జరపలేదని దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
దళిత యు వతి రేప్, మర్డర్ కేసులో సాక్షాత్తు ఎస్పీ రాజకీయ కోణంలో చూడొద్దని అనడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా నాలుగో రోజు కూడా వివిధ ప్రజా సంఘాలు దళిత సంఘాలతో పాటు చైతన్య మహిళా సంఘం నాయకులు గ్రామానికి వెళ్లి నిజనిర్ధారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడితోపాటు అతడి స్నేహితుల పాత్ర కూడా ఉందని ఊరు మొత్తం చెబుతున్నా.. పోలీసులు ఆదిశగా దర్యాప్తు చేయడం లేదని ఆరోపించారు. మరోవైపు దళిత యువతి కేసులో పోస్టుమా ర్టం నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదిక వస్తే గానీ తదుపరి చర్యలు చేపట్టలేమని పోలీస్ యంత్రాంగం చెబుతున్న మాటపై ప్రజాసంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిని బలపరు స్తూ స్థానిక ఎమ్మెల్యే కూడా బాధితులతో ఇదే మా ట మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా దళిత యువతి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడం.. నమస్తే తెలంగాణ వరుస కథనాలతో ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. ఆ గ్రామానికి కలెక్టర్ విజయేంద్ర బోయి వెళ్లి బాధితులను పరామర్శించారు.
బాధితులకు ఇందిరమ్మ ఇల్లు, తల్లికి ప్రైవేట్ ఉద్యో గం, తమ్ముడికి గురుకుల పాఠశాలలో ఉచిత విద్యతోపాటు ప్రభుత్వపరంగా రావాల్సిన సహాయాన్ని అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మరోవైపు దళిత యువతి కేసులో అధికార పార్టీపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో నాలుగు రోజుల తర్వాత దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆ గ్రామానికి భారీ బందోబస్తు నడుమ వెళ్లి బాధితులను పరామర్శించి రూ.50వేల ఆర్థికసాయం అందజేశారు. ఇంత జరిగినా ఈ కేసులో పోలీస్ దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటు ఇటు తిరిగి పోలీస్ దర్యాప్తు సరిగ్గా జరగలేదని అధికార పార్టీ నేతల అండదండలతో నిందితులను కాపాడుతున్నారని.. ప్రధాన నిందితుడు విష్ణుతో పాటు అతని స్నేహితులను బహిరంగంగా ఉరితీయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వేముల గ్రామంలో దళిత యువతి అత్యాచారం హత్య కేసును తిరిగి సమీక్షించాలని.. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి మందకృష్ణ మాదిగ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరణ అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఎస్పీ ఇచ్చిన స్టేట్మెంట్ ఫైనల్ కాదని మరోసారి పునర్ సమీక్షించాలని ప్ర త్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని డి మాండ్ చేశారు.
ఘటన జరిగిన 17వ తేదీ రోజు 8 నుంచి తొమ్మిది గంటల మధ్య ఏం జరిగింది అనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలన్నారు. ముందుగా హార్ట్ఎటాక్ అని చెప్పి పుకార్లు లేపే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అయితే బంధువులు యువతి శరీరంపై ఉన్న గాయాలు, అక్కడ బాత్రూంలో పడి ఉన్న రక్తస్రావం.. ఘటన స్థలం సమీపంలో ఉన్న బీరు బాటిళ్లు చూసి ఇది ఒక్కడి వల్ల అయ్యే పని కాదని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఘటన స్థలంలో ఉన్న రక్తస్రావం చూస్తే ఇద్దరి మధ్య జరిగింది కాదని అర్థమవుతుందన్నారు. ఈ కేసులో సాక్షాత్తు ఎస్పీ రాజకీయంగా చూడొద్దని రాజకీయం చేసి మాట్లాడడం విడ్డూరమన్నారు. అసలు ఇందులో రాజకీయాలు ఉన్నాయని ఎస్పీకి ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
తనే రాజకీయాలు మాట్లాడి మరింత అనుమానాలు రేకెత్తించిందని.. దీనికి ఎస్పీనే జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటన జరిగిన స్థలంలో విష్ణు ఫోన్ కాల్ రికార్డును పరిశీలించాలని ఆ టైంలో ఎవరెవరికి ఫోన్ చేశాడో తనకు ఎవరెవరు ఫోన్ చేశారో మొత్తం కాల్ రికార్డు బయట పెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఆమె సృ్పహ తప్పలేదని అప్పటికే మృతిచెందిదని ఆ స్థాయిలో దర్యాప్తు జరగలేదనేది స్పష్టమవుతుందన్నారు. ఘటన స్థలం నుం చి పోలీసులు స్వాధీనం చేసుకున్న బీరు బాటిళ్లు పరిశీలిస్తేనే అక్కడ ఉన్నది ఒక్కరు కాదని తేలుతుందని.. నిజాలు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలని లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
మూసాపేట మండలం వేములలో బాధిత కు టుంబ సభ్యులను కలెక్టర్ విజయేందిర బోయి పరామర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేముల ఘటనకు సంబంధించి, బాధిత కుటుంబానికి ప్రభుత్వంపరంగా అండగా ఉంటూ రావాల్సిన పరిహారం అందజేస్తామని, అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. యువ తి సోదరుడిని కుటుంబ సభ్యులు కోరుకున్న గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్డీవో నవీన్, తాసీల్దార్ రాజు తదితరులు ఉన్నారు.
దళిత యువతి లైంగిక దాడి, హత్య ఘటనపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న తరుణంలో అధికార పార్టీకి చెందిన దేవరకద్ర ఎమ్మెల్యే ఎట్టకేలకు నాలుగు రోజుల తర్వాత బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పోస్టుమార్టం నివేదిక గురించి పదేపదే చెప్ప డం చర్చనీయాంశంగా మారింది. ఈరోజు పోస్టుమార్టం రిపోర్ట్ రాబోతుంది, పోస్టుమార్టం రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు పోలీస్ శాఖ తీసుకుంటుందని తెలిపారు. అంటే పోలీసుల దర్యాప్తు సక్రమంగా జరగలేదనేది అనుమానాలు కలుగుతున్నాయి.
ఘటన సమాచారం తెలిసిన వెంటనే ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. పోలీస్ దర్యాప్తును అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతుందని అనుమానాలను ఎమ్మెల్యే బహిర్గతం చేసినట్లయింది. మృతురాలి తల్లి ఫిర్యా దు మేరకు 18వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ నమో దు చేసి అదేరోజు నిందితుడిని అరెస్టు చేశారని ఎమ్మెల్యే అంటున్నారు.. కానీ పోలీసులు మా త్రం ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించినట్లు చెబుతున్నారు. బాధిత కుటుంబానికి వ్యక్తిగతంగా రూ.50వేల ఆర్థిక సాయం ఎమ్మెల్యే అందజేశారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ప్రైవేట్ సంస్థలో అమ్మాయి తల్లికి ఉద్యోగం, తమ్ముడికి ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్లో సీటు ప్రభుత్వపరంగా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు.
దళిత యువతిపై లైంగికదాడి చేసి చంపేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు పక్షపాతంతో వ్యవహరించి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ని జనిర్ధారణ చేపట్టాయి. రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా విచారణ నిష్పక్షపాతంగా జరిపి దో షులను శిక్షించాలని డిమాండ్ చేశారు.