నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగా ణ): సొంతూళ్లోనే పని చేసుకొని కుటుంబాలను పోషించుకునేలా చేస్తున్న పథకం మహాత్మాగాం ధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. పేదలు వల స పోకుండా చేయడమే ఈ పథకం ఉద్దేశం. అలాంటి ఈ పథకం ద్వారా ప్రతి జిల్లాలో లక్షలాది మంది పేదలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పేదలకు పని కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం అమలవుతున్నది. అయితే ప్రమాదవశాత్తూ ఈ పనులు చేపడుతున్న కూలీలు గాయపడుతున్నారు. కాళ్లు, చేతులు విరగడం, గునపాలు గుచ్చుకోవడంతో పాటు ఆటోలు, ట్రాక్టర్లలో ప నులకు వెళ్తూ, తిరిగి వచ్చే సమయాల్లో, పని చేస్తూ పాము కాట్లకు గురవుతూ, వడ దెబ్బ సోకి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇది పేదల కుటుంబాలను మరింత అగాధంలోకి నెడుతున్నది. అసలే పేదలు…ఆపై గాయాల పాలైతే దవాఖాన ఖర్చులు భరించడం, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారుతున్నది.
ఇక కుటుంబ పెద్దగా ఉన్న కూలీ చనిపోతే కుటుంబంలో భార్యాపిల్లలు అనాధలుగా మారుతున్నారు. ఇటీవలే జడ్చర్లలో ముగ్గురు కూలీలు ట్రాక్టర్‌పై వెళ్తూ చనిపోయిన విషాదకర సంఘటన జరిగింది. ఇలాంటి ఘటనల్లో కూలీలకు ఇప్పటి వరకు కేంద్రం ఉపాధి హామీ చట్టంలో పరిహారం అమలు చేస్తున్నది. అయితే మారిన కాలంతో పాటుగా పెరిగిన ధరలను, ఖర్చులను పరిగణలోకి తీసుకొని పరిహారాన్ని సైతం పెంచుతూ నిర్ణయించింది. ఇది పేదలకు ఎంతో ప్రయోజనకారిగా మారనున్నది. రెక్కాడితే డొక్కాడని కూలీలకు పరిహారం పెంచుతూ వెలువడిన ఉత్తర్వులు సంతోషాన్ని నింపుతున్నాయి. కూలీ పనులు చేస్తూ శాశ్వత అంగవైకల్యం పొందితే ఇప్పటి వరకు రూ.25వేలు ఉంటే ఇకపై రూ.1లక్ష వరకు పరిహారం అందనుంది. అలాగే పక్షవాతానికి గురైతే రూ.50వేల నుంచి రూ.2లక్షలకు పెరిగింది. పని చేసే ప్రాంతాల్లో ఆరేళ్లలోపు పిల్లలు శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. అదే విధంగా పని ప్రాంతాల్లో పిల్లలు, కుటుంబ సభ్యు మరణిస్తే రూ.50వేల నుంచి రూ.2లక్షల పరిహారంపెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇలా ఉపాధి హామీలో గాయపడిన కూలీలకు పరిహారం పెంపు ఆ కుటుంబాల్లో ఊరట కల్పించనుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,93,718 మందికి జాబ్ కార్డులు ఇవ్వగా 11వేలకుపైగా శ్రమ శక్తి సంఘాల్లో 2.15లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇందులో 1,01,416 మంది కూలీలు ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నట్లుగా అధికారుల లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇలా ఒక్క నాగరకర్నూల్ జిల్లాలోనే లక్షకుపైగా కూలీలకు ఈ పరిహారం పెంపు వర్తించనుండటం విశేషం.