నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ నిర్ణయం దేశానికే ఆదర్శమన్నారు. అన్నివర్గాలకు సముచితస్థానం కల్పించి పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తున్నదన్నారు. అలాగే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.