“పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు.. మూడే ముళ్లు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్లు..” అంటూ సినీ వర్ణనకు తీసిపోని విధంగా ఆదివారం నాగర్‌కర్నూల్‌లో సామూహిక వివాహాలు జరిగాయి. ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుక సినిమా సెట్టింగ్‌ను తలపించింది. భారీగా వేసిన మండపాల్లో 220 జంటలు ఒక్కటయ్యాయి. బంధుమిత్రులు,ప్రజలు భారీగా తరలివచ్చారు. ముఖ్య అతిథులుగా ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వర్రావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో కలిసి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి దంపతులు వధూవరులను ఆశీర్వదించారు. సాయంత్రం డీజే డ్యాన్స్‌ల మధ్య ఊరేగింపుగా స్వగ్రామాలకు వధువులను అప్పగించారు.
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 12: జిల్లాకేంద్రంలోని జెడ్పీమైదానం వేదికగా ఎంజేఆర్ ట్రస్టు అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సామూహిక వివాహాల వేడుక అంబురాన్నంటింది. భారీ వేదికపై ఏర్పాటు చేసిన ముత్యాల పందిళ్లలో 220జంటలు ఒక్కటయ్యారు. ఇప్పటివరకు నాలుగు విడుతల్లో పెండ్లిళ్లు నిర్వహించగా ఐదోసారి అట్టహాసంగా సామూహిక వివాహాలు జరిపించి పేద కుటుంబాల్లో పెద్దదిక్కయ్యాడు ఎమ్మెల్యే మర్రి. హిందూముస్లింలు, క్రిస్టియన్లకు వారి వారి సంప్రదాయ పద్ధతుల్లో పెండ్లిళ్లు చేశారు.
ట్రస్టు అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, సతీమణి జమునరాణి ముందుండి పెండ్లి పెద్దలుగా వ్యవహరిస్తూ ఓ వైపు లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం, మరోవైపు 220జంటలకు ఒకేసారి పెండ్లి తంతు జరిపించారు. సినిమా సెట్టింగ్‌ను తలపించేలా భారీగా వేసిన మండపాల్లో సుమూహూర్తాన నూతన వధూవరులు ఒక్కటయ్యాయి. వేడుకకు పార్లమెంట్ సభ్యులు కే కేశవరావు, నామానాగేశ్వర్‌రావు, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్యల అతిథులుగా హాజరై ఆశీర్వదించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా తరలొచ్చి వివాహ వేడుకను తిలకించి వధూవ రులను ఆశీర్వదించారు.
వేడుకకు వచ్చిన ప్రజలకు, బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. వధూవరులకు ఇప్పటికే పట్టువస్ర్తాలు, బంగారు తాళి, మెట్టెలు అందించిన ట్రస్టు సభ్యులు పెండ్లి అనంతరం బీరువా, మంచం, బెడ్, దిండ్లు, ట్రావెలింగ్ బ్యాగ్, టేబుల్ ఫ్యాన్, మిక్సీ, కుక్కర్ వంటసామగ్రి అందజేశారు. సాయంత్రం నూతన జంటలను డీజే డ్యాన్సుల మధ్య భారీ ఊరేగింపుగా స్వగ్రామాలకు ట్రస్టు సభ్యులు దగ్గరుండి అప్పగింతలు చేశారు.
అంతకుముందు ముఖ్యఅతిథులతో కలిసి మర్రి కుటుంబసభ్యులు ప్రతి పందిరి వద్దకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే సోదరుడు మర్రి వెంకట్‌రెడ్డి, కలెక్టర్ ఉదయ్‌కుమార్, ఎస్పీ మనోహర్ దంపతులు, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, ప్రజాప్రతినిధులు పాల్గొని మధూవరులను ఆశీర్వదించారు.
రాజకీయాలకతీతంగా సేవ చేయాలని..
నియోజకవర్గంలోని పేదలకు రాజకీయాలకతీతంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో తన తండ్రి జంగిరెడ్డి పేరుతో ఎంజేఆర్ ట్రస్టును స్థాపించినట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. గతంలో ఈ ప్రాంతంలో నీళ్లు, కరెంటు లేక ఇక్కడి ప్రజలు ముంబయి తదితర ప్రాంతాలకు వలస వెళ్లేవారన్నారు. ఇంట్లో ఆడబిడ్డల పెండ్లి చేయాలంటే పేదలు పడుతున్న కష్టాలను చూడడమే కాకుండా తాను స్వయంగా అనుభవించినందుకే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానన్నారు. ఇప్పటికే నాలుగు విడుతలుగా 485జంటలకు సామూహిక వివాహాలు జరిపించామని, ఐదోసారి 220పెండ్లిళ్లు చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
ప్రతి జంటకు రూ.2లక్షల వరకు ఖర్చు చేసి విలువైన సామగ్రి అందిస్తున్నట్లు చెప్పారు. తొలిసారి వివాహాలు చేసేందుకు ఇబ్బందులు పెట్టారన్నారు. వేదికకు పర్మీషన్ నుంచి మొదటి విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు ఇబ్బందులకు గురిచేశారన్నారు. అందుకు తాను రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. రూ.9కోట్లతో కార్పొరేట్‌స్థాయిలో స్కూల్లు నిర్మిస్తున్నానని, ఇప్పటికే తిమ్మాజిపేటలో పారంభించామని, సిర్సవాడ, తాడూరులోనూ నిర్మాణదశలో ఉన్నాయన్నారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సహకారంతో ఇంత ఘనంగా రాజకీయ, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న తనకు సహకరిస్తున్న వారందరికీ, కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మనసున్న మారాజు
ఒకే వేదికపై 220మంది పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు చేస్తూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మనసున్న మారాజుగా నిలిచారు. రెండుసార్లు అత్యధిక మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి పెండ్లిళ్లు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం. సంపాదించిన దాంట్లో పేదలకు కొంత పంచడంలో వచ్చే ఆనందం అంతాఇంతా కాదు. ఇలా పెండ్లిళ్ల రూపంలో సేవచేస్తుండడం స్ఫూర్తిదాయకం.
– గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, అచ్చంపేట
నిజమైన సేవకుడు
సొంతింటి పెండ్లి మాదిరిగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వైభవంగా పేదలకు పెండ్లిళ్లు చేస్తూ నిజమైన సేవకుడిగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో నిలుస్తున్నారు. ఉన్నదాంట్లో సమాజానికి ఇచ్చేవారే నిజమైన సేవకులు. ఇలాంటి అదృష్టం మర్రికి దక్కడం అదృష్టం. ఒక్కో స్కూల్‌కు రూ.3కోట్ల చొప్పున ఖర్చుచేసి కార్పొరేట్‌స్థాయిలో తీర్చిదిద్దడం గొప్ప విషయం. చదువుకోవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి స్వతహాగా ఫీజులు చెల్లించడం అనేది గొప్ప వ్యక్తిత్వం. ఒకే వేదికపై 220పెండ్లిళ్లు చూసే భాగ్యం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది.
– కేశవరావు, ఎంపీ
పేదింటి ఆడబిడ్డలకు దేవుడు
నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి చేస్తున్న సేవలు అభినందనీయం. పేదింటి ఆడబిడ్డలకు పెండ్లిళ్లు చేస్తూ ఆ కుటుంబాల్లో దేవుడిగా నిలిచారు. పేదలకు సేవచేయాలన్న తలంపుతో తన తండ్రి పేరుతో ప్రత్యేకంగా ట్రస్టును ఏర్పాటు చేసి వారి కండ్లముందే సేవా కార్యక్రమాలతోపాటు పెండ్లిళ్లు చేయడం సంతోషం. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవదుల్లేవు. అలాగే సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేయడం
అభినందనీయం.
– నామానాగేశ్వర్‌రావు, ఎంపీ