ఆత్మకూరు, మే 10: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య లభిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. మూలమల్ల, జూరాల, మోట్లంపల్లి, తిప్డంపల్లి, గుంటిపల్లి, ఆరెపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాట్లాడారు. సీఎం సంకల్పించిన ఈ కార్యక్రమంతో ప్రభుత్వ బడులకు మహర్దశ పట్టనున్నదన్నారు. త్వరలోనే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను సైతం భర్తీ చేయనున్నారన్నారు. మౌలిక వసతుల కల్పనతో పాటు సిబ్బంది నియామకానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మొదటి దశలో మంజూరైన నిధులతో ఆయా పాఠశాలల్లో మూత్రశాలలు, విద్యుత్, ఫర్నిచర్, పాఠశాలకు పెయింటింగ్, గ్రీన్ చాక్‌బోర్డ్, ప్రహరీ, కిచెన్ షెడ్డు, నూతన తరగతి గదులు వంటివి చేపడుతారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, జెడ్పీటీసీ శివరంజని, పీఏసీసీఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, లక్ష్మీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రీయాదవ్, వైస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, జిల్లా విద్యాధికారి రవీందర్, మండల విద్యాధికారి భాస్కర్‌సింగ్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.