బాలానగర్, మే 10: పొలం తనపేర చేయలేదని తల్లిని దారుణహత్య చేసి సంఘటన మంగళవారం బాలానగర్ మండలం గుడిబండతండాలో చోటుచేసుకున్నది. సీఐ జములప్ప, ఎస్సై జయప్రసాద్ కథనం మేరకు.. తండాకు చెందిన కమిలి(40)కి 33గుంటల పొలం ఉన్నది. భర్త కొన్ని సంవత్సరాల కిందట చనిపోయాడు. పొలంలో సగభాగం తనకు చేయాలంటూ కొడుకు సంతోష్ తరుచూ కమిలితో గొడవపడేవాడు. కొడుకు బాధ తట్టుకోలేక తల్లి సంవత్సరం నుంచి హైదరాబాద్లో ఉంటున్నది. కాగా సోమవారం తండాలో ఓ శుభకార్యానికి తండాకు వచ్చింది. విషయం తెలుసుకున్న సంతోష్ మంగళవారం ఉదయం తల్లిని కలిసి పొలం సగభాగం కావాలని మళ్లీ గొడవ పెట్టుకొన్నాడు. మాటామాటా పెరిగి, తల్లిని కత్తితో దారుణంగా హత్యచేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. కుటుంబ సభ్యులను సర్పంచ్ గోపీనాయక్, ఎంపీటీసీ లింగూనాయక్ పరామర్శించారు.