మహబూబ్‌నగర్, మే 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నారాయణపేట జిల్లాలో సోమవారంమున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ.81.94 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో యువ సారథి పాల్గొననున్నారు. గోల్డ్ సోక్ మార్కెట్ నిర్మాణానికి భూమి పూజతోపాటు ప్రజల దాహార్తిని తీర్చే దుకు రూ.29.59 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ పంప్ హౌస్‌ను ప్రారంభించనుండగా.. కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్ బండ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కేటీఆర్‌తోపాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టె ం రామ్మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. అమాత్యుడి పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నారాయణపేట జిల్లా కేంద్రానికి రానున్నారు. గతంలో రెండు సార్లు పేటలో పర్యటించిన కేటీఆర్… ప్రస్తుతం మూడోసారి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. రూ. 81.94 కోట్లతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను జిల్లాకేంద్రంలో ఆయన ప్రజలకు అందించేందుకు వస్తున్నారు. 5 ప్రారంభోత్సవ కార్యక్రమాలు, 9 శంకుస్థాపనల్లో మంత్రి పాల్గొంటారు. స్వర్ణకారులు ఎప్పటి నుంచి కోరుతున్న మేరకు రూ. 20 కోట్ల నిధులతో గోల్డ్ సోక్ (బంగారు వ్యాపార సముదాయం) మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
నాణ్యమైన బంగారు ఆభరణాలకు పేరుగాంచిన పేటలో గోల్డ్ సోక్ మార్కెట్ ఏర్పాటు వల్ల అత్యంత అధునాతన కళాత్మకమైన ఆభరణాలను తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్‌ను పెంపొందించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకేచోట బంగారు ఆభరణాల షోరూములు, అధునాతన యంత్రాలతో వివిధ డిజైన్లతో ఆభరణాలను తయారు చేసే యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ నూతన పోకడలపై శిక్షణ కూడా అందించి వృత్తి నైపుణ్యాలను పెంపొందించేలా ఏర్పాట్లు చేయనున్నారు. దీనివల్ల సంప్రదాయ బంగారు వ్యాపారులు, ఈ వృత్తిపై ఆధారపడిన కార్మికులకు ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా నారాయణపేటలో గోల్డ్ సోక్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తుండటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పేట దాహార్తిని తీర్చే మిషన్ భగీరథ..
రూ. 29.59కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ పంప్ హౌస్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే పేటకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నా… పంప్ హౌస్ నిర్మాణం వల్ల ఎలాంటి సమస్య లేకుండా నిత్యం శుద్ధమైన తాగునీరు అందించేందుకు అవకాశం ఏర్పడనుంది. పేటలో సరైన క్రీడా మైదానం లేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో రూ. 6 కోట్లతో చేపట్టే మినీ స్టేడియం వల్ల చక్కని మైదానం అందుబాటులోకి రానుంది.
జిల్లా ఏర్పడిన తర్వాత అద్దె భవనంలో కొనసాగుతూ వచ్చిన జిల్లా గ్రంథాలయం కోసం రూ. 2 కోట్లతో అధునాతన భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. జిల్లా కేంద్రమైనప్పటికీ కనీసం మినీ ట్యాంక్ బండ్ లేక సేదతీరేందుకు ఇబ్బందులు పడుతున్న పట్టణ వాసులకు కేటీఆర్ మరో కానుకను తీసుకువచ్చారు. రూ. 4కోట్లతో నిర్మించనున్న కొండారెడ్డిపల్లి మినీ ట్యాంక్ బండ్ పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జిల్లా మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఎస్. రాజేందర్‌రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పర్యటనలో పాల్గొననున్నారు.
కేటీఆర్ పర్యటన వివరాలు..
పటిష్ట బందోబస్తు నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు
నారాయణపేట, మే 8: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేసేందుకు సోమవారం ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేటకురానున్న సందర్భంగా 600మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం పట్టణంలోని శెట్టి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 13 కార్యక్రమాలను 8 సెక్టార్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అధికారులకు, సిబ్బందికి రూట్‌మ్యాప్ వేసి బందోబస్తు స్కీంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భరత్, డీఎస్పీ సత్యనారాయణ, డీసీఆర్బీ సీఐ వెంకటేశ్వరరావు, సాయి మనోహర్ పాల్గొన్నారు.