నాగర్‌కర్నూల్, మే 8 (నమస్తే తెలంగాణ) : మొక్కల పండుగకు అధికార యంత్రాంగం సన్నద్ధమ వుతున్నది. 8వ విడుతలో భాగంగా జూలైలోనే మొక్కలను నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టులోగా పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో 33 శాతం అటవీ శాతం పెంచేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారాన్ని ప్రారంభించారు. దీంతో పల్లెలు, పట్టణాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఇప్పటికే గ్రీనరీకి కేరాఫ్‌గా పల్లె ప్రకృతి, బృహత్ వనాలు మారాయి.
హరితహారం పథకం అమలుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. రాష్ట్రంలో అటవీ శాతాన్ని 33శాతం చేసేందుకు సీఎం కేసీఆర్ 2015లో ఈ పథకం ప్రారంభించారు. అప్పటి నుంచి గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా మొక్కలు నాటుతున్నారు. దీనివల్ల అటవీ శాతంలో పెరుగుదల కనిపిస్తున్నది. ఇలా ఇప్పటి వరకు ఏడు విడుతలుగా హరితహారం పథకం అమలైంది. ప్రతి సంవత్సరం జిల్లాలో కోటికిపైగా మొక్కలను నాటుతూ వస్తుండగా రెండేండ్ల నుంచి ఈ సంఖ్యను తగ్గించారు. ఈసారి 8వ విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు డీఆర్డీవో, అటవీ శాఖలు నర్సరీల్లో మొక్కలను పెంచుతున్నారు. జూన్ నాటికి నాటే స్థాయిలో మొక్కలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ పథకంలో భాగంగా గ్రామాలకు వెళ్లే రోడ్లతో పాటుగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో మొక్కలను నాటుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, ఎంపీల్లాంటి ఉన్నత ప్రజాప్రతినిధులూ భాగమవుతుండటంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. గ్రామ పంచాయతీల్లో, పురపాలికల్లో నర్సరీలను పాలకవర్గాలు నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను నిర్మించారు. ఇక్కడ పార్క్‌ను తలపించేలా మొక్కలను నాటడం జరుగుతున్నది. అలాగే మండల స్థాయిలో బృహత్ వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక హరితహారానికి నిధుల సమస్యను లేకుండా గత నెల నుంచే ఎమ్మెల్యేల నుంచి విద్యార్థుల వరకు హరితనిధి పేరిట రూ.15నుంచి రూ.6వేల వరకు ఆయా శాఖల ద్వారా సేకరించనున్నారు.
నాటిన మొక్కలకు జీపీఎస్ ద్వారా అనుసంధానం చేస్తూ సంరక్షణకు ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. నాగర్‌కర్నూల్ జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి 5.21కోట్ల మొక్కలను నాటారు. ఈ సంవత్సరం 8వ విడతకు గాను 461వన నర్సరీల్లో 98లక్షల మొక్కలను పెంచుతున్నారు. కాగా 68లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా కేటాయించనున్నారు.
68లక్షల మొక్కలు సిద్ధం..
జిల్లాలో 8వ విడుత హరితహారంలో భాగంగా 68లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ స్థలాల్లో, నదీ పరీవాహక ప్రాంతాలు, కాలువలు, కెనాళ్ల పొడవునా మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి 5.21కోట్ల మొక్కలు నాటారు.. వర్షాలు పడితే జూలైలోనే హరితహారం ప్రారంభించి ఆగస్టునాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం.
– నర్సింగరావు, డీఆర్డీవో, నాగర్‌కర్నూల్