వడ్డేపల్లి మండలం చిన్నతండ్రాపాడుకు చెందిన రాఘవేంద్రరెడ్డి పదేండ్ల కిందట విజయవాడ వెళ్లి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడిపే వాడు. అక్కడే కుటుంబంతో హాయిగా జీవనం సాగించేవాడు. అతనికి అనుకోకుండా ఊపిరితిత్తుల సమస్య ఏర్పడింది. వైద్యం చేయించుకునే క్రమంలో కిడ్నీలు సైతం ఫెయిల్ కావడంతో రెండు రోజులకు ఒకసారి డయాలిసిస్ చేయించుంటేగానీ బతకలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడబెట్టిన డబ్బంతా దవాఖానకే ఖర్చు అయింది. నాలుగేండ్లుగా భార్య, తల్లి దూరమయ్యారు. అతడికి పిల్లలు లేరు. వైద్యం చేయించుకోవడానికి చివరకు కర్నూలు చేరాడు. అక్కడ ఇంటి అద్దెలు కట్టలేక సమీపంలో వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో చిన్నగదిలో అద్దెకు చేరాడు. వారు కూడా ఖాళీ చేయమనడంతో వీధిన పడ్డాడు.
ఆక్సిజన్‌తో దవాఖాకు..
అతడికి ఆక్సిజన్ లేకుంటే నిమిషమైన బతకలేడు. ఆక్సిజన్ సిలిండర్ కొనడానికి డబ్బులు లేక ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. కర్నూలుకు ద్విచక్ర వాహనంపై 80కిలోమీటర్లు వెళ్లి సిలిండర్‌ను కొనుగోలు చేసుకొని భుజాన వేసుకొని అటునుంచి డయాలసిస్ సెంటర్‌కు వెళ్తాడు. నిద్ర పోవడానికి కూడా వీలులేదు. ఊపిరితిత్తుల సమస్య, శ్వాస సమస్య వస్తున్నందునా 24గంటలు కూర్చొనే ఉండాలి. కూర్చొనే నిద్రపోవాలి. కనీసం డయాలసిస్ సెంటర్‌కు వెళ్లి రావడానికి రెండు వేలు ఖర్చవుతుందని అంబులెన్స్ సౌకర్యం అయినా కల్పించాలని వేడుకుంటున్నాడు. ఎవరైన ఒక పూట భోజనం పెడితే తినాలి. లేదంటే ఆక్సిజనే ఆహారం అనుకొని బతకాలి.
వెంకటనారాయణ చేయూత..
ఇంత దుర్భర జీవితం అనుభవిస్తున్న రాఘవేంద్రరెడ్డిని మానవతా దృక్పథంతో శాంతినగర్‌కు చెందిన సబ్బినేని వెంకటనారాయణ తన ఇంటి ఆవరణంలో ఓ పెంకుటిల్లు, బాత్రూం ఏర్పాటు చేయించి భోజన వసతి కల్పించాడు. చివరికి బెంగళూరుకు చెందిన డాక్టర్ శాంతి సహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ వారు కరెంటుతో నడిచే ఆక్సిజన్ మిషన్ ఇప్పించారు. కరెంటు ఉన్నంత సేపు సమస్య వుండదు. కరెంటు పోతే గ్యాస్ సిలిండర్ ఎక్కించుకోవాల్సిందే. ఇది తాత్కాలికమే ఉపశమనే.. శాశ్వత పరిష్కారం కోసం బాధితుడు ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని కోరుతున్నారు. కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్పీ ఇస్తే రూ.5లక్షలతో సరిపోతుందని, ఇతరులు ఎవరైనా ఇస్తే రూ.20లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని తెలిపారు. అయితే కుటుంబ సభ్యుల ఎవరూ కిడ్నీ ఇవ్వడానికి సుముఖంగా లేరని చెబుతున్నాడు.