కొత్తకోట, మే 8 : మెరుగైన విద్యాబోధనే ప్రభుత్వ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం మండలంలోని నిర్వేన్, పాలెం గ్రామాల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలోని పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బడులను బాగు చేసుకునేందుకు మొదటి దశలో 35 శాతం పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారన్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించి మౌలిక వసతులు, డిజిటలైజేషన్ తరగతి గదులతోపాటు మెరుగైన ఇంగ్లిష్ మీడియాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పరుస్తామన్నారు.
తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. అనంతరం పట్టణంలోని మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా బాలికల పాఠశాలకు రూ.63 లక్షలు నిధులు మంజూరవగా పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, ఎంపీపీ గుంతమౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, మున్సిపాల్ చైర్పర్సన్ సుకేశిని, వైస్ చైర్పర్సన్ జయమ్మ, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి ప్రశాంత్, రైతుబంధు సమితి అధ్యక్షుడు కొండారెడ్డి, కౌన్సిలర్లు రాములుయాదవ్, నాయకులు పాల్గొన్నారు.