‘కనిపించే మూడు సింహాలు’..అంటూ ఓ సినీ హీరో పవర్ఫుల్ డైలాగ్ స్టార్ట్ చేసినా.., ‘పోలీసోడి ఒంటి మీద యూనిఫాం కూడా డ్యూటీ చేస్తది’ అంటూ ప్రత్యేకంగా రాసినా..‘సలాం పోలీస్’ అంటూ పాట రాసినా అది వాళ్లకే చెల్లుతుంది. పోలీస్ అంటేనే ఓ పాషన్. వారిని చూస్తేనే సెల్యూట్ చేయాలనిపించే ఒక గౌరవం.. తప్పు చేసిన వారికి ఒక భయం.. నిస్సహాయులకు, అభాగ్యులకు ఓ భరోసా..ఓ భద్రత. అలాంటి జాబ్ కోసం ఎంతైనా కష్టపడడానికి సిద్ధంగా ఉంటుంది యువత. ఎలాగైన ఉద్యోగం సంపాదించాలని ఉన్న ఊరు, వాళ్లను వదిలేసి..కసరత్తు చేస్తుంటారు. అలాంటి యువత కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. సోమవారం కానిస్టేబుల్, ఎస్సైల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడంతో యువకులు ఎగిరిగంతేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కొలువు కొట్టేందుకు కోచింగ్‌లకు సైతం వెళ్తున్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్ విడుదల కావడంతో మరింత శ్రద్ధగా దీక్షతో ఉద్యోగం సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు.
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గత నెలలో వనపర్తి పర్యటన సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు తీపి కబురు చెప్పనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. వనపర్తి వేదికగానే ఉద్యోగాల భర్తీకి బీజం పడింది. ఇప్పు డు ఒకేసారి 16వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులు వనపర్తి సభను.. ముఖ్యమంత్రి మాటను గుర్తు చేసుకుంటున్నారు. 95 శాతం ఉ ద్యోగాలు స్థానికులతోనే భర్తీ చేయనుండడంతో నిరుద్యోగుల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16,614 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో 16,027 కానిస్టేబుల్, 587 ఎస్సై, 414 సివిల్ ఎస్సై, 66 ఏఆర్ ఎస్సై, 23 టీఎస్ఎస్పీ ఎస్సై, 12 ఎస్పీఎఫ్ ఎస్సై, 5 రిజర్వ్ ఎస్సైతోపాటు అగ్నిమాపక శాఖలో 26 ఎస్సై, 8 డిప్యూటీ జైలర్ పోస్టులు ఉ న్నాయి. నియామక ప్రక్రియలో భాగంగా మే 2 నుంచి 20 వరకు www.tslprb.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ఒక్కసారిగా వేలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగులు ఎగిరిగంతేస్తున్నారు. ఇన్నాళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు ప్రభుత్వం సకాలంలో నోటిఫికేషన్ ఇవ్వడంతో మంచి అవకాశం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. ఒకేసారి ఇన్ని ఉద్యోగాల భర్తీ ద్వారా కష్టపడి చదువుతున్న తమకు ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు. ఇన్ని ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. జోగుళాంబ జోన్ పరిధి లో 35 ఎస్సై ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. ఈ జోన్ పరిధిలోని 5 జిల్లాల్లో 745 కానిస్టేబుల్ ఉద్యోగాలను, 73 ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
తొలిసారిగా సొంత జిల్లాల్లో ఉద్యోగాలు..
సొంత జిల్లాల్లో ఉద్యోగాలను సాధించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం అవకాశం కల్పిస్తుందని నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జోగుళాంబ జోన్ పరిధిలోని 5 జిల్లాల్లో కలిపి 4,429 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఇ ప్పుడు పోలీసు శాఖలోని ఖాళీలను ప్రకటించారు. జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగాల భర్తీ ద్వారా అత్యంత వెనుకబడిన జిల్లాలైన నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లా ల్లో స్థానికంగానే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు అనేమాటే ఎంతో అద్భుతంగా ఉందని నిరుద్యోగులు చెబుతున్నారు. ఇక జోనల్ పోస్టులు సైతం ఉమ్మడి జిల్లా పరిధిలోనే పోటీ ఉంటుంది. మల్టీ జోన్ విషయానికి వస్తే చార్మినార్, యాదాద్రి జోన్ల నుంచి జోగుళాంబ జోన్ ఉద్యోగార్థులకు పోటీ ఉండనున్నది.
పోలీసు కలను నెరవేర్చుకుంటా..
పోలీసు కలను నెరవేర్చుకునేందుకు కష్టపడుతా. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రత్యేక శిక్షణ తీసుకొని పరీక్షలకు సిద్ధమవుతా. ఎలాగైనా ఎస్సై,కానిస్టేబుల్ ఉద్యోగం సాధించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తా.
– కుర్వ శ్రీనివాస్, మహ్మదాబాద్
నోటిఫికేషన్ విడుదల హర్షణీయం..
పోలీసు శాఖలో పోస్టు ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయ డం హర్షణీయం. కానిస్టేబుల్ జాబ్ కొట్టేందుకు శిక్షణ తీసుకొని సిద్ధమవుతున్నా. ఒకేసారి అధికం గా పోస్టులు భర్తీ చేసేందు కు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం అభినందనీ యం. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– రాఘవేంద్ర, కోయిలకొండ
పోలీస్ కావడమే నా ఆశయం..
పోలీస్ ఉద్యోగం సా ధించాలన్నదే నా ఆశ యం. దాని కోసం ఎంతో కష్టపడి చదువుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యో గ యువతను దృష్టిలో ఉంచుకొని 16 వేలకు పై గా ఉద్యోగాలను భర్తీ చే యడం శుభపరిణామం. ప్రత్యేక శిక్షణ తీసుకొని పరీక్షలకు సిద్ధమవుతా. ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల అభిలాష నెరవేరుస్తా.
– చంద్రకళ, నాగర్‌కర్నూల్
నిరుద్యోగుల పాలిట దేవుడు..
పోలీస్ నియామకాల్లో ఇంత భారీ ఎత్తున భర్తీ చేయడం అభినందనీయం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగుల పాలిట దేవుడు. ఇచ్చిన మాటకు అనుగుణంగా 92 వేల ఉద్యోగాలకుగానూ పోలీస్ శాఖలో మొదటగా నోటిఫికేషన్ ఇవ్వడం హర్షణీయం. ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉంటా. డిగ్రీ సెకండియర్ చదువుతూనే ఉద్యోగానికి ప్రిపేరవుతున్నా.
– మండ్ల సాయిచరణ్, అజ్జకొల్లు
మాట నిలబెట్టుకున్న సీఎం..
ఎస్సై, కానిస్టేబుల్ పో స్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీ యం. సీఎం కేసీఆర్ భారీ గా పోస్టులు భర్తీ చేస్తూ మాట నిలబెట్టుకున్నారు. వరుసగా ఆయా పోస్టులకు నోటిఫికేషన్లు విడుద ల చేస్తుండడం నిరుద్యోగులకు వరంగా మా రింది. ఇప్పటికే కోచింగ్ తీసుకున్నా. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– మహేశ్, అయిజ