మక్తల్ రూరల్, ఏప్రిల్ 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో భాగంగా గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఒక్క పల్లెప్రగతే కాకుండా అన్ని పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. దీంతో గ్రామాలకు జాతీయస్థాయిలో గుర్తింపు వస్తున్నది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మహిళా సంఘాల ప్రతిభ, ఆర్థిక స్వావలంబన సాధించడంతో మక్తల్ మండలం మంథన్‌గోడ్ గ్రామ పంచాయతీ నానాజీ దేశ్‌ముఖ్ గౌరవ్ ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపికైంది. దీంతో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్, గ్రామస్తులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర బృందం మంథన్‌గోడ్ గ్రామాన్ని సందర్శించింది.
పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల మేరకు గ్రామ సభలు నిర్వహించడం, అభివృద్ధి కార్యక్రమాలను రికార్డుల్లో మినిట్స్ రూపకంగా మెయింటెనెన్స్ చేయడం వంటి అంశాలను పరిశీలించింది. అంతర్గత రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చడం, పారిశుధ్యం, హరితహారం ద్వారా పల్లెప్రకృతి వనం నిర్మాణం, వైకుంఠధామం, డంపింగ్ యార్డు, రైతువేది వంటి అభివృద్ధి పనులతోపాటు గ్రామంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే మహిళా సంఘం సభ్యులు స్త్రీనిధి రుణం ద్వారా సొంతంగా హెర్బల్ ప్రాడక్టులను తయారు చేసి ఆర్థిక స్వావలంబన సాధించడంతో వారు ఆశ్చర్యపోయారు.
సర్పంచ్, మహిళా సంఘాల సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. మహిళా సంఘంలోని 15 మంది సభ్యులు కలిసి హెయిర్ ఆయిల్, సర్ఫు, వ్యాసిలిన్, హెన్నా, ఫినాయిల్, సున్నుండలు వంటివి తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో అనతికాలంలోనే మహిళలు లాభాలు సాధించారు. తాము సొంతంగా ఉపాధి పొందినట్లు మహిళా సంఘం అధ్యక్షురాలు ఫాతిమాబేగం, సభ్యులు లావణ్య, రాజేశ్వరి, సుజాత తెలిపారు. తమ గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.
చాలా సంతోషంగా ఉన్నది..
మంథన్‌గోడ్ గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉన్నది. గ్రామ పంచాయతీ ద్వారా వచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకున్నాం. ఎప్పటికప్పుడు గ్రామ సభలు పెట్టి ప్రజలకు విషయాన్ని తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పథకాలను వంద శాతం అమలు చేస్తున్నాం. గ్రామంలో మహిళా సంఘం సభ్యులు చాలామంచిగా పనిచేస్తున్నారు. స్త్రీనిధి రుణాలతో సొంతంగా పనులు చేసుకుంటున్నారు.
– మహాదేవమ్మ, సర్పంచ్, మంథన్‌గోడ్
ప్రభుత్వ పథకాల వల్లే అవార్డు..
సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాల వల్లే రాష్ర్టానికి అవార్డులు వస్తున్నాయి. నా సొంత గ్రా మమైన మంథన్‌గోడ్‌కు కేంద్ర ప్ర భుత్వం జాతీయ అవార్డు ప్రకటించడం ఆనందంగా ఉన్నది. పల్లెప్రగతి కింద చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. గ్రామాభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా.
– వనజాగౌడ్, జెడ్పీ చైర్పర్సన్, నారాయణపేట