మహబూబ్నగర్ ఏప్రిల్ 12: జిల్లాలోని ఖాళీగా ఉన్న సర్పంచ్, ఎంపీటీసీలు, వార్డుసభ్యుల ఎన్నికలకు సంబంధించి రూపొందించిన ఓటరు జాబితాపై ఈ నెల 16వ తేదీ వరకు అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం ఉంద ని అదనపు కలెక్టర్ తేజస్నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం జెడ్పీ సీఈవో చాంబర్లో ఖాళీగా ఉన్న సర్పంచ్, వార్డుసభ్యులు, ఎంపీటీసీల స్థానాలకు సంబంధించి ఫొటో ఓటరు జాబితా తయారీ ప్రచురణపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఖాళీగా 9 సర్పంచ్, 343వార్డు సభ్యులు, 15ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి రూపొందించిన ఫొటో ఓటరు జాబితాను ఈ నెల 8న ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రచురించినట్లు తెలిపారు. ఈ నెల 11నుంచి 16వ తేదీ వరకు ఎంపీడీవోలకు ఎలాంటి అంభ్యతరాలు ఉన్న తెలియజేయాలని సూచించారు.
రాజకీయ పక్షాల ప్రతినిధులు పూర్తిస్థాయిలో విషయాలను తెలియపర్చాలని పేర్కొన్నారు. ఈ నెల 19న అభ్యంతరాల పరిష్కారం, 21న తుది ఓటరు జాబితా ప్రచురణ ఉంటుందన్నారు. జనవరి 1, 2022 ఆధారంగా జనవరి 5న ప్రచురించిన అసెంబ్లీ ఓటరు జాబితాను ఆధారంగా చేసుకొని ఖాళీగా ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డుసభ్యులు, ఎంపీటీసీల ఫొటో ఓటరు జాబితాను రూపొందించామన్నారు. ఈ నెల 13న మండల స్థాయిలో ఎంపీడీవోలు, మండలస్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. జడ్చర్లలో 15 ఎంపీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా ఓటరు జాబితాను ఈ నెల 23న ప్రచురించనున్నట్లు తెలిపారు. ఓటరు జాబితాను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. సమావేశంలో డీపీవో వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో జ్యోతి, డివిజినల్ పంచాయతీ అధికారి వరలక్ష్మి తదితరులు ఉన్నారు.