మహబూబ్‌నగర్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) చైర్మన్‌గా మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన గంజి వెంకన్న ముదిరాజ్, మరో 15 మందిని పాలకవర్గ సభ్యులుగా నియమించాలంటూ సీఎం కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రతిపాదనలు అందజేశారు. త్వరలో ముడా పాలకమండలి జీవోను సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డె వలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) తర్వాత రాష్ట్రంలోనే అతిపెద్దదైన ముడాను ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. హెచ్ఎండీఏ ఏర్పాటు తర్వాతే హైదరాబాద్ అతిపెద్ద నగరంగా అ భివృద్ధి చెందిందని మంత్రి తెలిపారు. ముడా ఏర్పాటుతో జిల్లా రూపురేఖలు మారబోతున్నాయన్నారు. మూడు ము న్సిపాలిటీలతోపాటు వివిధ మండలాలు, గ్రామాల్లో రో డ్లు, పార్కులు, జంక్షన్ల విస్తరణ, పట్టణ సుందరీకరణ, క్ర మపద్ధతిలో లే అవుట్లు ఏర్పాటవుతాయన్నారు. ఇకపై లే అవుట్ల అనుమతుల కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా జీవో విడుదల చేశాక మహబుబ్‌నగర్‌లో ముడా కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
16 మందితో ప్రతిపాదనలు..
చైర్మన్‌తోపాటు 15 మందిని పాలకవర్గ సభ్యులుగా ప్ర తిపాదించారు. చైర్మన్‌గా మహబూబ్‌నగర్‌కు చెందిన గం జి వెంకన్న ముదిరాజ్, సభ్యులుగా ఎం.శ్రీకాంత్ (జడ్చ ర్ల), మమ్మద్ ఇంతియాజ్ (కోడ్గల్), బి.రవిశంకర్ (జడ్చ ర్ల), ఆర్.భూపాల్ (బాలానగర్), ఎం.శ్రీశైలం యాదవ్ (రాజాపూర్), వై.జి.ప్రీతమ్ కుమార్ (జడ్చర్ల), జి.చెన్న య్య (నవాబ్‌పేట), కే.ఆంజనేయులు (జమిస్తాపూర్), ఏ. సాయిలు యాదవ్ (మహబూబ్‌నగర్), పి.వెంకటేశ్‌గౌడ్ (మహబూబ్‌నగర్), కొండా బాలయ్య (హన్వాడ), మి ర్యాల వేణుగోపాల్ గుప్తా (మహబూబ్‌నగర్), ఎస్.చంద్రశేఖర్‌గౌడ్ (భూత్పూర్), ఎం.సాయిలు (అమిస్తాపూర్), కే.లక్ష్మీకాంతరావు (దేవరకద్ర)ను ప్రతిపాదించారు.
ముడా ఏర్పాటుతో లాభాలు..
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో ప్రత్యేక మాస్టర్ ప్లా న్ ఏర్పాటవుతుంది. 40 ఏండ్ల అవసరాలను దృష్టిలో ఉం చుకొని మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తారు. రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్ పథకాలతో పెద్ద ఎత్తున నిధుల విడుదల చేసే అవకాశం ఏర్పడుతుంది. మున్సిపాలిటీలతోపాటు గ్రామాల్లోనూ పార్కులు, ఆట స్థ లాలు ఏర్పాటు చేస్తారు. మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. పట్టణాలకు దీటుగా గ్రామాల్లోనూ డ్రైనేజీ వ్యవస్థ, మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. ఇం టి నిర్మాణాలకు పక్కాగా నిబంధనలు అమలు చేస్తారు. లే అవుట్లు, వెంచర్లు వేయాలంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనుమతి తప్పనిసరి. దీంతో అక్రమ లే అవుట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండబోదు.
ఇక వేగంగా అభివృద్ధి..
ముడా పరిధిలో బెంగళూరు, తిరుపతి, చెన్నై, రాయిచూరు, బళ్లారి, గోవా తదితర నగరాలను కలిపే జాతీయ రహదారి 44, 167 ఉన్నాయి. ఇక హైదరాబాద్-బెంగళూరు, చెన్నై, తిరుపతి, రాయిచూరు రైల్వే లైన్ కూడా ఉన్నది. రైల్వేలైన్ డబ్లింగ్, విద్యుద్దీకరణ పూర్తి కావడంతో హైదరాబాద్‌కు కేవలం గంటలోనే చేరుకునే అవకాశం ఏర్పడింది. మరోవైపు పోలేపల్లి సెజ్, పనులు జరుగుతున్న ఐటీ పార్క్ ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా నిర్మిస్తున్న కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లు కూడా ముడా పరిధిలోకే వస్తాయి. వీటి బ్యూటిఫికేషన్, టూరిజం అభివృద్ధికి ముడా ద్వారా భారీగా నిధు లు మంజూరయ్యే అవకాశం ఉన్నది. ఇవన్నీ ముడాను మరింత అత్యున్నత స్థాయికి తీసుకుపోతాయని ప్రజలు అంచనా వేస్తున్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ముడాను అద్భుతంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నారు.
ముడా స్వరూపం ఇలా..
12 మండలాలు, 142 గ్రామాలు, మూడు మున్సిపాలిటీలు (మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్)లతో కలిపి ఈ ఏడాది ఫిబ్రవరి 14న జీవోఎంస్ నెంబర్ 26 ద్వారా ముడా ఏర్పాటు చేసింది. ముడా విస్తీర్ణం 1444.69 చ.కి.మీ కాగా.. 7,03,992 జనాభా ఉన్నది. మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల, నారాయణపేట, పరిగి నియోజకవర్గాల పరిధిలోని మహబూబ్‌నగర్ అర్బన్, మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడ, మూసాపేట, దేవరకద్ర, భూత్పూర్, నవాబ్‌పేట, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, కోయిలకొండ, మహ్మదాబాద్ మండలాలు ముడా పరిధిలోకి వస్తాయి.
విశ్వసనీయంగా ఉన్నందుకు..
గత మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచే అవకాశం ఉన్నా.. టీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు తన టికెట్‌ను యువకుడైన కిషోర్‌కు ఇచ్చేందుకు అంగీకరించాడు. పార్టీకి విశ్వసనీయంగా ఉన్నందుకు నాయకుడు గంజి వెంకన్న ముదిరాజ్‌కు ఊహించని పదవి వరించింది. సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు పార్టీకి నమ్మకంగా ఉన్న వారికి ఎప్పటికైనా పదవులు వాటంతట అవే వస్తాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కౌన్సిలర్ టికెట్‌ను త్యాగం చేసినందుకు వెంకన్నను ముడా చైర్మన్ పదవి వరించిందన్నారు. కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశాన్ని వదులుకున్న పార్టీ నేత మహమూద్‌కు సైతం మంచి అవకాశం లభిస్తుందని హామీ ఇచ్చారు. పార్టీ నిర్ణయాల మేరకు పార్టీ అభివృద్ధి కోసం పని చేసే వారికి పదవులు తప్పక లభిస్తాయి అని చెప్పేందుకు గంజి వెంకన్న ఓ ఉదాహరణ అని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.