జడ్చర్లటౌన్, మార్చి 29: కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మంగళవారం జడ్చర్లలో కార్మికసంఘాలు సమ్మె చేపట్టారు. తాసిల్దార్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రధాని నరేంద్రమోడీ సర్కార్‌ను గద్దె దించాలని నినాదాలు చేశారు. అనంతరం తాసిల్దార్ లక్ష్మినారాయణకు వినతిపత్రం సమర్పించారు. సీఐటీయు మండల కార్యదర్శి తెలుగు సత్తయ్య మాట్లాడారు. కార్మిక సంఘాల డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు పరశురాం, ఏఐటీయూసీ నాయకుడు కృష్ణయాదవ్, రైతుసంఘం, డీవైఎఫ్ఐ నాయకులు నాగరాజు, కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వ ఉద్యో గ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మంగళవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వెంటనే తమ విధానాలు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ అనుకూల విధానాలను, ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరించే విధానాలను విరమించుకోవాలన్నారు. అనంతరం కార్మికులు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ శంకర్సింగ్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చంద్రకాంత్, ఎర్ర నర్సింహులు, బాల్‌రాజు, కార్మికులు పాల్గొన్నారు.
ఇంధనం ధరలు తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ డిమాండ్ చేశారు. డీసీసీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ 5 రాష్ర్టాల ఎన్నికలు అయిపోగానే కేంద్రం డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను అన్యాయంగా పెంచిందని విమర్శించారు. నిత్యావసర ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. భవిష్యత్‌లో బీజేపీకి ప్రజలు బుద్దిచెబుతారన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్‌యాదవ్, సీజే బెనహర్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని సీఐటీయూ జిల్లా నాయకుడు దీప్లానాయక్ అన్నారు. మండలకేంద్రంలో కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక కార్మికుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని ఎద్దేవా చేశారు. కార్పొరేట్ సంస్థల కోసం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదన్నారు. కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ, ఆశకార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
కేంద్రప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్‌కు వినతిపత్రం ఇచ్చా రు. కార్యక్రమంలో కార్మిక నాయకులు శ్రీను, రంగయ్య, గోవిందు, భీమయ్య, ధర్మానాయక్ పాల్గొన్నారు.
గండీడ్ మండలంలో..
కేంద్రం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ, భవన నిర్మాణ కార్మికులు కోరారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా మండలకేంద్రంలో మంగళవారం నిరసన తెలిపారు. కార్యక్రమంలో రాములు, నర్సింహులు, చెన్నయ్య, ఫకీరయ్య, వెంకటయ్య, కృష్ణయ్య, సురేందర్‌గౌడ్, భగవంతుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.