మహబూబ్నగర్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మంగళవారం వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతెపల్లిలో అత్యధికంగా 42.9 డిగ్రీలు, కొత్తకోట మండలం కానాయపల్లిలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే సుమారు 2 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతున్నది. వాతావరణంలో ఒక్కసారిగా వేడి పెరిగిపోవడంతో సూర్యుడి ప్రతాపాన్ని తప్పించుకునేందుకు జనం గొడుగులు, టోపీలు ధరిస్తున్నారు. చాలామంది కాటన్ దుస్తులు ధరిస్తూ వేడి బాధ నుంచి విముక్తి పొందుతున్నారు. ఉత్తర తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని భావిస్తే.. దక్షిణ తెలంగాణ సైతం పోటీ పడుతున్నది. కేతెపల్లిలో నమోదైయిన 42.9 డిగ్రీలు.. మంగళవారం రాష్ట్ర స్థాయిలో ఐదో అత్యధిక ఉష్ణోగ్రతగా ఉన్నది. రాన్ను మూడ్రోజుల్లో గరిష్ఠంగా 39 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎండ ప్రభావం అధికంగా ఉండే తరుణంలో మధ్యాహ్న వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడిమి ప్రారంభమవుతున్నది. సాయంత్రం వేళ 6 గంటల వరకు కూడా ఎండల ప్రభావం ఉంటున్నది. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితిని ఊహించడమే కష్టంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.