మహబూబ్‌నగర్ మార్చి 29: ప్రజల సంక్షేమానికి చేపట్టిన భూసేకరణ పనులను జాప్యం చేయకుండా పూర్తిచేయాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ నుంచి మంగళవారం రైల్వే, జాతీయరహదారులు, ఇతర ప్రాజెక్టుల భూసేకరణపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైల్వే డబ్లింగ్ లైన్ భూసేకరణ, జాతీయ రహదారుల సంస్థ చేపట్టిన పనులకు సంబంధించి, చించోలి రహదారి భూసేకరణపై ఆయా శాఖల అధికారులు, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఆర్డబ్ల్యూఎస్, టీఎస్ఎంఐడీసీ, ఈడబ్ల్యూ ఐడీసీ, పీఆర్ తదితర శాఖల ద్వారా పునరావాస కేంద్రాల్లో చేపట్టిన పనులు, టెండర్ల ప్రక్రియను కలెక్టర్ ఆయా శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. మనఊరు-మన బడి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, 15రోజుల్లో పనులు గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మన ఊరు -మనబడి కింద ప్రణాళికలను జనరేట్ చేయాలన్నారు. ఏఈ, డీఈలతో చర్చించి షెడ్యూల్ నిర్ధారణ చేయాలన్నారు. భూసేకరణను తుదిదశకు తీసుకురావాలని సూచించారు.
వైద్యశాఖ అధికారులకు అభినందనలు
క్షయ నివారణలో విశేష ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో బహుమతి, ప్రశంసలు అందుకున్న జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, డాక్టర్ రఫీక్‌ను కలెక్టర్ ఎస్ వెంకట్రావు ప్రత్యేకంగా అభినందించారు. కలెక్టర్ చాంబర్‌లోని రాష్ట్రస్థాయిలో అధికారులు అందజేసిన ప్రశంసాపత్రాన్ని, జ్ఞాపికను వారికి అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. క్షయ నివారణలో భాగంగా కొత్త కేసులను గుర్తించడం వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించడం, రావాల్సిన డబ్బును సకాలంలో వచ్చేటట్ల చేయడంలో మహబూబ్‌నగర్ జిల్లా ముందంజలో ఉన్నందుకుగానూ ఈ నెల 6న హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కృష్ణ, డాక్టర్ రఫీక్, ముషీరాబాద్ ఎమ్మెల్యే గోపాల్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ టీబీ రాజేశం చేతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్న విషయం విధితమే.