మహబూబాబాద్, మార్చి 30 : బంజారా సినిమా ‘సేవాదాస్’ను గిరిజనులు ఆదరించాలని మహబూబాబాద్‌కు చెందిన సినీ నిర్మాత మూడు బాలుచౌహాన్ కోరారు. బుధవారం మహబూబాబాద్‌లోని ఆయన కార్యాలయంలో విలేకరులకు సినిమా వివరాలు వెల్లడించారు. నవరసాలతోపాటు మానవీయ విలువలను జోడించి ఈ చిత్రాన్ని నిర్మించామన్నారు. దేశంలో 18 కోట్ల గిరిజనులున్నారని.. వారందరూ చూడాలనే మొదటి గిరిజన పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నామని వివరించారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ ఇతివృత్తాన్ని పరిచయం చేస్తూ, వారి సంస్కృతి, సంప్రదాయాలను మేళవించినట్లు చెప్పారు. సినిమాలో సీనియర్ నటులు సుమన్, భానుచందర్ల పాత్రలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. తెలంగాణలో సినిమా కల్చర్ పెరగాలనే ఉద్దేశంతో తీర్చిదిద్దామని చెప్పారు. ఏప్రిల్ 1న బంజారా భాషలో, 8 నుంచి తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. సినిమాకు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్టర్, హీరో కేపీఎన్.చౌహాన్, నిర్మాతలు వినోద్రైనా ఇస్లావత్, సీతారాం బాదావత్, బాలుచౌహాన్, మ్యూజిక్ బోలేషావళి అందించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు చాసల రంజిత్‌రెడ్డి, టీఆర్ఎస్వీ నాయకులు రవికుమార్, గిరిజన సంఘ బాధ్యుడు రామునాయక్ పాల్గొన్నారు.