మహబూబ్‌నగర్, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహిళా దినోత్సవాన్ని సంబురంగా నిర్వహించాలని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. మహిళల సంక్షేమం కోసం చేపట్టిన అద్భుతమైన పథకాలను వారికి వివరిస్తూ విజయవంతం చేయాలని భావిస్తున్నది. మహిళాబంధు కేసీఆర్ సంబురాలు అంబరాన్నంటాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడు రోజులపాటు మహిళా దినోత్సవ సంబురాలు కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, పార్టీ అధ్యక్షులు మహిళాబంధు కేసీఆర్ పేరిట సంబురాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీన సంబురాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజన సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ చాటిన విద్యార్థినులు, ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘం నాయకురాళ్లు, మహిళలను సన్మానించనున్నారు. కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, థ్యాంక్యూ కేసీఆర్ వంటి ఆకారం వచ్చేలా మానవహారాలు ఏర్పాటు చేయనున్నారు. 7వ తేదీన కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఇతర మహిళా సంక్షేమం కార్యక్రమాల లబ్ధిదారులను ఇంటివద్దకు వెళ్లి నేరుగా కలిసి సెల్ఫీలు తీసుకుంటారు. 8వ తేదీన నియోజకవర్గస్థాయిలో మహిళలతో సమావేశం కానున్నారు.
సంక్షేమానికి పెద్దపీట..
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెండ్లికి సాయం అందింది. సుమారు 11 లక్షల మంది కేసీఆర్ కిట్‌తో లబ్ధి పొందారు. మాతాశిశు మరణాలు తగ్గాయి. ప్రభుత్వ దవాఖానల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతోపాటు బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు మహిళాబంధు కేసీఆర్ పేరిట ఘనంగా సంబురాలు చేయాలని నిర్ణయించాం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లోనూ ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని శ్రేణులకు పిలుపునిస్తున్నాం.
– డా.సి.లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు
ఘనంగా నిర్వహించాలి..
మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు సంబురాలను విజయవంతం చేయాలి. గతంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుబంధు వారోత్సవాలతోపాటు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. అదే తీరును కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే