జడ్చర్ల టౌన్/మహబూబ్‌నగర్ మెట్టు గడ్డ, ఫిబ్రవరి 10 : మరికొద్ది గంటల్లో జరగాల్సిన వివాహం ఆగిపోయింది. కా రులో వెళ్తున్న పెండ్లి కొడుకు రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. అత డు వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. మహబూబ్‌నగర్ జిల్లా నక్కలబండతండా సమీపంలో ఈ ఘటన చే సుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన చైతన్య అలియాస్ బబ్లూ(35) ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నారాయణపేట జిల్లా తిర్మలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాడు. వనపర్తికి చెందిన యువతి(ఏఈవో)తో చైతన్యకు వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11:30 గంటలకు మహబూబ్‌నగర్‌లోని ఎంబీ చర్చిలో వారిద్దరికి పెండ్లి. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల సమయంలో జడ్చర్ల వెళ్తున్నట్లు ఇంట్లో నుంచి చైతన్య తన కారులో వెళ్లాడు. కొద్దిసేపటికే జడ్చర్ల మండలం నక్కలబండతండా సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో చైతన్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు, ఎస్సై శంషొద్దీన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువకుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చైతన్య మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. జడ్చర్ల దవాఖాన మార్చురీ వద్దకు చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు.