మహబూబ్నగర్, నవంబర్ 7 : ప్రజావాణికి వచ్చిన సమస్యలను అధికారుల ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సమస్యలతో సతమతమవుతూ అధికారుల వద్దకు వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశం హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను అదనపు కలెక్టర్ స్వీకరించారు. నేరుగా ఫిర్యాదుదారుల వద్దకు వెళ్లి ఫిర్యాదులను తీసుకున్నారు. అనంతరం ఫిర్యాదారులను ఉద్దేశించి అధికారులతో మాట్లాడారు.
గ్రామ, మండలస్థాయిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. పరిష్కరించేందుకు ఆదేశించిన కేసులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అనంతర పరిష్కరించాలని తెలిపారు. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు పరిగణలోకి తీసుకొని పరిష్కరించాలని తెలిపారు. ప్రజా ఫిర్యాదులపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ప్రజావాణికి 126ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, జెడ్పీ సీఈవో జ్యోతి, డీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో యాద య్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.