కొల్లాపూర్, నవంబర్ 3 : కరోనా మహమ్మారి తరువాత ప్రజలు ప్రమాద బీమా కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఆయా కంపెనీలు కొత్తకొత్త పాలసీలు తీసుకొస్తున్నాయి. ప్రస్తుతం కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ప్రమాద బీమా ఉండడం ఎంతో ముఖ్యం. ఇందులో భాగంగా పోస్టాఫీస్.. స్వల్ప ప్రీమియంతో కొత్త ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. పోస్టాఫీసుల్లో పొదుపు చేసుకునే డబ్బుకు మరింత భద్రత కల్పించడమే కాకుండా.. రెట్టింపు లాభాలను కల్పిస్తున్నది.
ప్రమాద బీమా, సుకన్య సమృద్ధి యోజన, పీఎంజేజేబీవై, ఏపీవై, సేవింగ్ బ్యాంకు ఖాతా.. తదితర పథకాలు అమల్లో ఉన్నాయి. తాజాగా ప్రవేశపెట్టిన తపాలా బీమా పథకంతో ప్రజలకు బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. 18 నుంచి 65 ఏండ్ల మధ్య వయస్సున్న వారంతా బీమాలో చేరే అవకాశం కల్పించారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, టాటా ఏఐజీ ద్వారా తపాలా శాఖ ప్రమాద బీమాకు గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అతి తక్కువ వార్షిక ప్రీమియంతో అత్యధిక ప్రయోజనాలు పొందొచ్చు. ఈ బీమాలో చేరాలనుకున్న వారు నేరుగా పోస్టాఫీస్‌లో సంప్రదించొచ్చు. లేదా పోస్ట్‌మ్యాన్ ఇంటికి వచ్చి బీమా గురించి వివరిస్తారు.
తపాలా బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ బీమా కింద ఎన్నో ప్రయోజనాలున్నాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉన్నది. పేద, మధ్య తరగతి కుటుంబాల వారు, గ్రామపంచాయతీల్లో పనిచేసే కార్మికులు సమీపంలో ఉన్న తపాలా కార్యాలయానికి వెళ్లి ప్రీమియం చెల్లించొచ్చు. అర్హత గల ప్రతి ఒక్కరూ ఈ బీమాలో చేరి సద్వినియోగం చేసుకోవాలి.
– మురళీయాదవ్, ఎస్పీఎం, కొల్లాపూర్