వనపర్తి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, రోడ్ల విస్తరణ పనులను జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. గురువారం ఐడీవోసీ స్టేట్ చాంబర్లో రోడ్ల విస్తరణ పనులపై కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గెజిట్ ప్రకారమే రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేసినట్లు వివరించారు.
జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తి చేశామన్నారు. మిగతావి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ పరిధిలో చేపట్టిన అనధికారిక కట్టడాలను మూడ్రోజుల్లో కూల్చి వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మాణ అనుమతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. వాటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. వనపర్తి అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం పబ్లిక్ హెల్త్, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల పనులపై మంత్రి సమీక్షించారు. రోడ్ డివైడర్లు, బైపాస్ రోడ్డు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
త్వరలో మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి పనుల పురోగతిపై చర్చించాలని కలెక్టర్ యాస్మిన్‌బాషాకు సూచించారు. చిట్యాలలోని డబుల్ బెడ్రూం నిర్మాణాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్, మీటర్లను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. కలెక్టర్ యాస్మిన్‌బాషా, అదనపు కలెక్టర్, అధికారులను మంత్రి అభినందించారు.
విద్యుత్‌శాఖ ఎస్ఈ నాగేంద్రకుమార్ మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులను వారం రోజుల్లో పూర్తి చేస్తామని మంత్రికి వివరించారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, ఎస్పీ అపూర్వారావు, అదనపు కలెక్టర్ ఆశీష్ సెంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఏఎస్పీ షాకీర్ హుస్సేన్, ఆర్అండ్బీ ఈఈ దేశ్యానాయక్, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహారెడ్డి, మిషన్ భగరీథ ఈఈ విజయ భాస్కర్‌రెడ్డి, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.