గద్వాల, సెప్టెంబర్ 22: స్వరాష్ట్రంలో ప్రభుత్వం దవాఖానలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని, కనీస సౌకర్యాలు లేని దవాఖానలకు మంచిరోజులు వచ్చాయి. కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో జిల్లా దవాఖానలకు ప్రభుత్వం విడుతల వారీగా సౌకర్యాలు కల్పిస్తున్నది. ఒకప్పుడు ఓపీ 250 మించేది కాదు. ప్రస్తుతం ఓపీ 850కు చేరుకుంది అంటేనే దవాఖానలో సౌకర్యాలు, వైద్య సేవలు ఏమేరకు అందుతున్నాయో తెలుసుకోవచ్చు. జిల్లా దవాఖానలో డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు, పిల్లలకు ప్రత్యేక వార్డు, ఐసీయూ, గుండెకు సంబంధించి ప్రాథమిక చికిత్స చేయడానికి సౌకర్యాలు, కరోనా సమయంలో ఒకేసారి 200మంది వరకు ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ ప్లాంటు, రోగ నిర్దారణ పరీక్షలు చేసే సెంట్రల్ డయాగ్నోస్టిక్ సెంటర్, జిల్లాకో నర్సింగ్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేయడంతో సర్కార్ దవాఖాన రూపురేఖలే మారిపోయాయి. దీంతో అత్యవసర సమయంలో రోగులను కర్నూల్,హైదరబాద్‌కు తరలించే అవసరం లేకుండా జిల్లా కేంద్రాల్లోనే అన్ని చికిత్సలకు వైద్య సేవలు అందుతున్నాయి.
గతంలో జిల్లా దవాఖానలకు మందులు అవసరమైతే ఉమ్మడి జిల్లా కేంద్రంలో మూడు సెంట్రల్ మెడికల్ స్టోర్(సీఎంఎస్)మందులు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కొన్నిసార్లు కాలయాపన జరగడంతోపాటు అవసరమైనా మందులు జిల్లా దవాఖానలకు సరైనా సమయంలో అందేవి కావు. దీంతో రోగులు ఇబ్బందులు పడేవారు. ప్రభుత్వం ఇబ్బందులకు చెక్ పెట్టింది. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్న తరుణంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. మందుల కొరత లేకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 12చోట్ల సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. గద్వాలలో ఇప్పటికే స్టోర్ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో స్టోర్ రూ.3.60కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంట్రల్ మెడికల్ స్టోర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. స్టోర్‌లో పని చేయడానికి అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెడిసిన్ ప్యాకర్స్, వాచ్మెన్ పోస్టులు అవుట్సోర్సింగ్ ద్వారా నియమించే అవకాశం కల్పించింది.