మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, సెప్టెంబర్ 11 : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నేడు పూర్తిగా మారింది. ప్రభుత్వ దవాఖానలో గర్భిణులు సంతోషంగా కాన్పు చేయించుకొని క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, మెరుగైన వైద్యంతో రోజురోజుకూ సర్కారు వైద్యంపై నమ్మకం పెరుగుతున్నది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చి కాన్పు చేయించుకుంటున్నారు. ఇక్కడ ఏకకాలంలో 150మంది ప్రసవాలు చేయించుకొని వైద్యసేవలు పొందుతున్నారు. కాన్పుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ దవాఖానను ఆధునీకరించి గర్భిణులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు.
గణనీయంగా పెరిగిన కాన్పులు..
ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించిన తర్వాత సర్కారు దవాఖానల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేసీఆర్ కిట్ ప్రారంభం కాకముందు నెలకు 350కి మించని ప్రసవాల సంఖ్య.. ఇప్పుడు సుమారు 850కిపైగా జరుగుతునాయంటే కేసీఆర్ కిట్ పుణ్యమే. 2017 జూన్ 2వ తేదీ నుంచి 2022 సెప్టెంబర్ 8వ తేదీవరకు 50వేలమంది కాన్పు చేయించుకున్నారు. ఇప్పటివరకు 43,850మందికి కేసీఆర్ కిట్ అందజేశారు. కేసీఆర్ కిట్‌తో జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే వైద్యులు గర్భిణులను పరీక్షించి అవసరమైతే అక్కడే కాన్పు చేస్తున్నారు.
ఎలాంటి అసౌకర్యం కలగకుండా..
ప్రభుత్వ దవాఖానకు కాన్పు నిమిత్తం వచ్చే గర్భిణులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వైద్యసేవలు అందిస్తున్నారు. గర్భిణులకు అన్నిరకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన మందులను అందజేయడంతోపాటు ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. దీంతో మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు గర్భిణులు క్యూ కడుతున్నారు. వైద్యాధికారులు సైతం గర్భిణలకు నిరంతరం అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రసవం కోసం వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏడాది కాలంలోనే 9,067మందికి ప్రసవాలు చేశారు.
కేసీఆర్ కిట్ బాగుంది
నాకు పాప పుట్టింది. ప్రభుత్వం ఇచ్చిన కేసీఆర్ కిట్‌లో సబ్బులు, పౌడర్, పాపకు దోమ లు కుట్టకుండా జాలిపరుపు, పాపకు డ్రస్, నాకు చీర, నూనె తదితర 16రకాల వస్తువులు ఉన్నాయి. అలాగే రూ. 5వేలు బ్యాంక్ ఖాతాలో వేస్తామని చెప్పారు. కేసీఆర్ కిట్ పథకం చాలా బాగుంది. మాలాంటి పేదోళ్లకు కేసీఆర్ సార్ తండ్రిలాక కాన్పు చేయించి ఇంటికి వెళ్లేందుకు 102 వాహనం కూడా పెట్టడం సంతోషంగా ఉంది.
– నాగలక్ష్మి, కొంరెడ్డిపల్లి, మూసాపేట మండలం
మంచిగా కాన్పు చేశారు
ప్రభుత్వ దవాఖానలో కాన్పు చేసుకుంటే కేసీఆర్ కిట్ ఇస్తారని, మంచి వైద్యసేవలు అందిస్తారని వచ్చాను. ప్రభుత్వ దవాఖానలో కాన్పు బాగా చేశారు. మొదటి కా న్పు కోసం వచ్చినప్పటికీ చాలా మంచి వైద్యం అందించారు. పైస ఖర్చు లేకుండా పండంటి బిడ్డను తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తున్నాం.. ప్రస్తుతం కేసీఆర్ కిట్ వచ్చినాక ప్రైవేట్ దవాఖానలకు పోకుండా ప్రభుత్వ దవాఖానలకే వస్తున్నారు.
– సుమలత, ఈర్లపల్లి, జడ్చర్ల మండలం
ఇప్పటివరకు 50వేల ప్రసవాలు చేశాం
కేసీఆర్ కిట్ అమల్లోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి గర్భిణులు వందల సంఖ్యలో ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారు. రోజు 30నుంచి 40మందికి ప్రసవాలు చేస్తున్నాం. 2017 జూన్ నుంచి 2022 సెప్టెంబర్ 8వ తేదీవరకు రికార్డుస్థాయిలో 50వేల మందికి ప్రసవాలు చేశాం. అందరి సహకారంతో హైరిస్క్ కేసులతోపాటు కరోనా సమయంలోనూ గర్బిణులకు ప్రసవాలు చేశాం.
– డాక్టర్ రాధ, గైనకాలజిస్ట్,మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన