వనపర్తి, సెప్టెంబర్ 10: రజాకార్లను ఎదిరించి ఎందరో రైతులను పోరాటబాట పట్టించిన వీరనారి చాకలి ఐలమ్మ అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. దున్నేవాడిదే భూమి అని ధైర్యాన్ని నింపి ప్రాణాలను ఫణంగా పెట్టి నిలిచిన తెలంగాణ నిప్పుకణం అని స్పష్టం చేశారు. శనివారం చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఐలమ్మ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బందూకు చేతబట్టి దొరల గుండెల్లో సింహ స్వప్నమై గర్జించి సాయుధ పోరాటాన్ని నడిపిన వనిత అన్నారు. అలాగే పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో టీజేఏసీ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.
గోపాల్పేట, సెప్టెంబర్ 10: తెలంగాణలో కొందరు అహంకారంతో పాదయాత్రలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. అడ్డగోలుగా దోచుకున్న అక్రమ సొమ్ముతో కిరాయికి పూలు చల్లించుకుంటూ అద్దె మనుషులతో పనికిమాలిన యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. యాత్రల పేరుతో అడ్డగోలుగా, నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఒక్క మాటకు వంద మాటలు బల్లెంలా దూసుకొస్తాయని, ఆత్మవిశ్వాసంతో చీల్చి చెండాడుతామని వైఎస్ షర్మిలపై నిప్పులు చరిగారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పద్మావతి గార్డెన్స్‌లో కొత్తగా మంజూరైన 1331 ఆసరా పింఛన్ల గుర్తింపు కార్డులు, ప్రొసీడింగ్‌లను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి జిల్లా పొల్కెపహాడ్ గ్రామ వాసి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సొంతూరికి ఏం చేశారని షర్మిల అవహేళనగా మాట్లాడడంపై మంత్రి ఘాటుగా స్పందించారు. గువ్వల అచ్చంపేట నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తాడు.. నేను ఇక్కడ అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. పొల్కెపహాడ్కు సాగునీరు అందడం వల్లే ఒక్క యాసంగిలో రూ.20 కోట్ల పంట పండించారని తెలిపారు. నువ్వు రాజన్న బిడ్డవైతే రేపు మునుగోడులో పోటీ చేసి సత్తా ఏంటో చూపించాలని షర్మిలకు సవాల్ విసిరారు. వనపర్తి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు తీసుకొచ్చామన్నారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 80 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుండడంతోపాటు కొత్త, పాతవి కలిపి 50 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. పేదలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో 57 ఏండ్లకే పింఛన్ సౌకర్యం కల్పించామన్నారు. నాటి ప్రభుత్వాల హయాంలో ఎవరైనా చస్తే తప్పా పింఛన్ వచ్చేది కాదని.. కానీ నేడు బతికున్న వారికి పింఛన్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, డీఆర్డీవో పీడీ రేణుక, ఎంపీడీవో హుస్సేనప్ప, ఎంపీపీ అడ్డాకుల సంధ్య, జెడ్పీటీసీ మంద భార్గవి, సింగిల్‌విండో చైర్మన్ రఘు యాదవ్, వైస్ చైర్మన్ గువ్వల రాములు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కోఆఫ్షన్ ఎండి మతీన్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు తిరుపతి యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గాజుల కోదండం, మహిళా అధ్యక్షురాలు అనురాధ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 10: జిల్లా ఖనిజ నిధులను మైనింగ్ ద్వారా నష్టపోయిన ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు మాత్రమే వినియోగించాలని జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్టు చైర్మన్, నాగర్‌కర్నూల్ జిల్లా ఇన్చార్జి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. శనివారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్టు సమావేశం నిర్వహించారు. ట్రస్టుకు మంత్రి అధ్యక్షుడు కాగా, కలెక్టర్ ఉదయ్‌కుమార్ కార్యదర్శిగానూ, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, మౌలిక వసతులు, సంక్షేమశాఖల అధికారులు సభ్యులుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 31వరకు నాగర్‌కర్నూల్ జిల్లాలో మినరల్ ఫండ్ రూ.38.98 కోట్లు జమ అయ్యిందన్నారు. మన ఊరు-మనబడి పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ మన ఊరు-మనబడి పనులు కల్వకుర్తి నియోజకవర్గం గుండూరులో ప్రారంభించలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ మన ఊరు-మనబడి పనుల పురోగతి, సమస్యలపై అధికారులు శాసన సభ్యులతో చర్చించకపోవడంతో సమస్యలు పరిష్కారం కాకుండా పనుల్లో జాప్యం జరుగుతున్నట్లు చెప్పారు. అంతకుముందు చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులరించారు. సమావేశంలో కలెక్టర్ ఉదయ్‌కుమార్, ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, డీఆర్డీవో పీడీ నర్సింగ్‌రావు, జిల్లా సంక్షేమ శాఖల అధికారులు, సభ్యులు పాల్గొన్నారు.